– రిపబ్లిక్ డే పెరేడ్‌కు అనుమతి నిరాకరణ
– ఇది కన్నడిగులకు అవమానం : సిద్ధరామయ్య
బెంగళూరు : దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో కర్నాటక శకటాన్ని ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర శకటానికి అనుమతి నిరాకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడు కోట్ల మంది కన్నడిగులను అవమానించిందని ఆయన చెప్పారు. గత సంవత్సరం కూడా కర్నాటక శకటానికి తొలుత తిరస్కరణే ఎదురైంది. అయితే ఆ తర్వాత దానిని అనుమతించారు. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కర్నాటకలో శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే గత సంవత్సరం రాష్ట్ర శకటాన్ని అనుమతించారని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సిద్ధరామయ్య తెలిపారు. మైసూరు రాజు నల్వాది కృష్ణరాజ వడయార్, కిట్టూరు రాణి చెన్నమ్మ, విజయనగర సామ్రాజ్య ప్రముఖుడు నాదప్రభు కెంపెగౌడ అందించిన సేవలను కొనియాడే శకటాలతో పాటు బెంగళూరు నగర వైభవాన్ని చాటిచెప్పే శకటాన్ని అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని ఆయన వివరించారు. అయితే కేంద్రం తమ అభ్యర్థనను తిరస్కరించిందని, కర్నాటక సాధించిన విజయాలను, రాష్ట్ర ప్రముఖులను జాతికి పరిచయం చేసే అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కంటగింపుగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ‘పన్నులలో వాటా, కరువు సాయం చెల్లింపు మొదలు కన్నడిగులు స్థాపించిన బ్యాంకులు, ఓడరేవులు, విమానాశ్రయాల అమ్మకం వరకూ అన్ని విషయాలలోనూ కేంద్రం రాష్ట్ర ప్రజలపై రాజకీయ దురుద్దేశంతో దాడి చేస్తూనే ఉంది. ఇప్పుడు శకటాన్ని తిరస్కరించడం ద్వారా మా గుర్తింపుపై మరోసారి దాడి చేసింది’ అని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఎవరూ ప్రశ్నించడం లేదని, వారంతా ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారని విమర్శించారు. కేంద్రం తన తప్పిదాన్ని వెంటనే సరిచేసుకోవాలని, కర్నాటకకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. కాగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో కర్నాటక శకటాన్ని వరుసగా 14 సంవత్సరాలు ప్రదర్శించారు. గత సంవత్సరం మహిళా సాధికారతపై శకటాన్ని రూపొందించారు.