కేంద్రంలో బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వేగం తగ్గుతుందని ఆశించిన వారి ఆశలు పటాపంచలయ్యాయి. మంత్రివర్గంలో భాగంగా కేంద్ర గనుల శాఖను మన రాష్ట్ర బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డికి కేటాయించింది. అయన పన్నెండు రోజులు తిరగకుండానే జూన్ 21న హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా 61 బొగ్గు బ్లాకులను వేలం ద్వారా అమ్మకానికి పెట్టాడు. ఇందులో మన రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను కూడా వేలంలో పెట్టారు. దీంతో ఈ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాలు ఆందోళనబాట పట్టాయి. సింగరేణి భవన్‌ను ముట్టడించాయి. సింగరేణి ప్రాంతంలో జూన్ 21న వేలంలో పెట్టిన రోజే సీఐటీయూ యూనియన్ అన్ని బావుల దగ్గర నిరసనలు చేసి ఉద్యమాన్ని ప్రారంభించింది. చివరకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాటి అనుబంధ ట్రేడ్ యూనియన్స్ కూడా గళం విప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. సింగరేణి పరిరక్షణ, బొగ్గు బావుల ప్రయివేటీకరణకు వ్యతిరేక ఉద్యమం మరోసారి ఊపందుకోబోతున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కొత్త బావులు సాధిస్తామని, ఉపాధి కల్పిస్తామని హామీనిచ్చింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని సింగరేణి ప్రాంతంలోని ఎంపీ స్థానాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఎన్నికల తర్వాత బొగ్గుబ్లాక్‌లను కేంద్రం వేలం వేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పోరాడకుండా విజ్ఞప్తులతో సరిపెడుతున్నది. కేంద్ర గనుల శాఖ మంత్రికి, ప్రధాన మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తులతో సరిపెడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుంది తప్ప విజ్ఞప్తులకు ఎప్పుడు దిగి రాలేదన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, సింగరేణిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్ష మేరకు పోరాడకపోతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. గని కార్మికులు కూడా గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఇటీవల ఏటీయూసీ అనుబంధ సంఘాన్ని గుర్తింపు సంఘంగా గెలిపించారు. ఆరు ఏరియాలలో ఐఎన్టీయూసీని గెలిపించారు. పోరాడే సంఘం సీఐటీయూ బలాన్ని పెంచారు. రెండు ప్రధాన సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని సింగరేణి బొగ్గు బ్లాకుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉదతం చేయాల్సిన కర్తవ్యం ఉంది.
సింగరేణిని ఎందుకు కాపాడుకోవాలి!
సింగరేణి గనులు తెలంగాణకు కొంగుబంగారం. కార్మికుల కష్టంతో సిరులు కురిపిస్తున్నాయి. సింగరేణి సంస్థ రాష్ట్ర అభివద్ధి ,నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణలో ఆరు జిల్లాలలో బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థగా సాగుతున్న ఏకైక సంస్థ సింగరేణి మాత్రమే. దేశంలో బొగ్గు ఉత్పత్తిలో 9.2శాతం వాటా కలిగి ఉంది. ఇప్పటివరకు 1753.78 మిలియన్ బొగ్గు వెలికి తీయబడింది. ఇంకా వందేండ్లకు సరిపడా బొగ్గు నిలువలున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల క్రమంగా బొగ్గు బ్లాక్‌లు మూతపడుతున్నాయి.కొత్త బావులు తీయకపోగా ఉన్న వాటిని కూడా మూసివేసి పైన ఓపెన్‌కాస్ట్‌లు తీస్తున్నారు. ప్రస్తుతం 18 ఓసిపి, 22 భూగర్భ గనులు మొత్తం 40 ఉన్నాయి. వీటిలో 39,856 పర్మినెంట్ వర్కర్స్, 26వేల కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. పరోక్షంగా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు. సిఎస్‌ఆర్ నిధులతో ప్రజల మౌలిక సదుపాయాల కోసం జిల్లాల్లో అనేక గ్రామాల్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇరవై ఏండ్లుగా లాభాలతో నడుస్తున్న సంస్థ సింగరేణి.ప్రతి సంవత్సరము కేంద్ర, రాష్ట్రాలకు డివిడెంట్లు,పన్నుల రూపంలో సుమారు రూ.8వేల కోట్లు చెల్లిస్తున్నది.ఒక్క 2022-23 సంవత్సరంలోనే కేంద్రానికి 3216 కోట్లు, రాష్ట్రానికి 5418 కోట్లు ఒరిస్సాకు 3.8 కోట్లు చెల్లించింది. కేంద్రంలో బీజేపీ పరిపాలించిన పదేండ్లకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు 49 వేల కోట్లు చెల్లించింది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి నిధులను వాడుకుంటున్నది. ప్రభుత్వ జెన్కో, ట్రాన్స్‌కో ఇతర సంస్థలకు బొగ్గును సరఫరా చేయించింది. బకాయిలు సుమారు రూ.30 వేల కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం సింగరేణికి బకాయిలు చెల్లించడం లేదు.అయినా ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు వేల కోట్ల లాభాలతో ఉంది. 2013 నుండి 24 మధ్య పదేండ్ల కాలంలో 20వేల మంది ఉద్యోగుల సంఖ్య తగ్గినా 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని పెంచింది. ఓపెన్ కాస్టు, కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతోనే ఉత్పత్తి పెరిగింది వాస్తవం. సంవత్సరానికి సగటున 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.సింగరేణిని ప్రభుత్వాలు ఎంత పిండుకున్నా సింగరేణి లాభాల బాటలో ఉండడానికి ప్రధాన కారణం కార్మికుల శ్రమనే. ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడమే.
సింగరేణిపై కేంద్రం దాడి!
దేశంలో 1973 నాటికి గనులను జాతీయం చేసే సమయానికి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. 1957లో మైన్స్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్టు వచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015లో ఈ చట్టానికి సవరణ చేసి కమర్షియల్ మైనింగ్ అవకాశం కల్పించారు. వేలం ద్వారా బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 200 బొగ్గుబ్లాక్‌లను ప్రయివేటు వారికీ కేటాయించింది. 2025 నాటికి నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరిట 160 బొగ్గు బ్లాక్‌లను ప్రయివేటుకు అప్పగించి మారు 29 వేల కోట్లు సంపాదించాలని నిర్ణయించింది. 2021లో సింగరేణి ప్రాంతంలో నాలుగు బ్లాకులను వేలంలో పెట్టింది. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమ్మె చేసినారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా పోరాడకుండా సింగరేణి సంస్థను వేలంలో పాలు పంచుకోకుండా చేసి తన అనుకూల సంస్థలైన అరబిందో ఫార్మాకు, ప్రతిమ గ్రూపులకు కోయగూడెం ఓసి త్రిని, సత్తుపల్లి ఓసి త్రి వచ్చే విధంగా చేసింది. కోయగూడెం ఓసి త్రీ గిరిజన ప్రాంతం 1 ఆఫ్ 70 యాక్ట్ పరిధిలో ఉన్నా అతిక్రమించి ఇప్పించుకున్నది. ఈ రెండు సంస్థలు నేటికి గంపెడు మట్టి తీయలేదు. మైనింగ్ అనుభవం లేదు.మిషన్లు లేని సంస్థలకు కట్టబెట్టిన ఫలితమిది.
సింగరేణి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి డ్రిల్లింగ్ చేసి 45 బొగ్గు బ్లాకులను గుర్తించింది. 15 బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కోరుతూ ఉన్నది. సింగరేణి సొంత నిధులను ఖర్చుపెట్టి కొత్తగూడెం నుండి సత్తుపల్లి వరకు రైల్వే ట్రాక్‌ను, బొగ్గు బ్లాక్ ల అన్వేషణ ఖర్చు, మౌలిక సదుపాయాలు కల్పించింది. కోయగూడెం ఓసి-3, సత్తుపల్లి ఓసి-3 బ్లాక్‌లను తిరిగి సింగరేణికి కేటా యించాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తాటిచర్ల1ను ఏఎంఆర్ సంస్థకు ఇప్పించుకున్నది.కేంద్రం సవరించిన ఎంఎండిఆర్ యాక్ట్ 1957లో సెక్షన్ 17 (1) ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రభుత్వరంగ సంస్థలకు గనులను కేటాయించడానికి అవకాశం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లకు కేటాయించు కుంటున్నది. తెలంగాణకు మొండిచేయి చూపుతున్నది.
శ్రావణపల్లి బ్లాక్ సాధనకు పోరు ఉధతం చేయాలి!
పదవ విడత వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గుబ్లాక్ 18.63 చదరపు కిలోమీటర్ పరిధిలో బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నాయని గుర్తించారు. ఇందులో 10.18 చదల కిలోమీటర్ల పరిధిలో ఆక్షన్‌లో పెట్టారు. 119.9 మిలియన్ టన్నుల బొగ్గు లభిస్తుంది. సింగరేణి విస్తరించడానికి తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి లభించడానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ బొగ్గు బ్లాక్‌ను ప్రయివేటువాళ్లకు దక్కకుండా అందరూ కలిసి కట్టుగా పోరాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తులతో సరిపెట్ట కుండా కేంద్రంతో పోరాటానికి దిగాలి. కార్మికుల, ఉద్యోగుల, ప్రజల మద్దతు ఉంటుంది. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ నెల 10న అన్ని బ్రాంచీలో పెద్దఎత్తున ధర్నాలు, జూలై 18న సింగరేణి భవన్ ముట్టడించ డానికి సిద్ధపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేయడానికి సంఘాలకు అతీతంగా కార్మికవర్గం సిద్ధపడాలి.
భూపాల్
9490098034