కేంద్రం కౌలు రైతులను ఆదుకోవాలి

Kakinada– రాష్ట్ర సదస్సులో సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
కాకినాడ: కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలని సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కౌలు రైతులు లేకుండా ఏ వ్యవసాయమూ సాగడం లేదని, నూటికి 80 శాతం మంది వాస్తవ సాగుదారులుగా కౌలు రైతు రైతులే ఉన్నారని తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని షాదీఖానా భవనంలో బుధవారం సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన కౌలురైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. కౌలు రైతులను గుర్తించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత రైతుల అప్పులు, ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయని తెలిపారు. కనీసం బడ్జెట్లో కూడా కౌలు రైతుల ప్రస్తావన తీసుకురాకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం అసమర్థత, చేతకానితనం, వివక్షత వల్ల కౌలు రైతులకు అన్నింటా అన్యాయం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కూడా కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కనీస గుర్తింపు కార్డులివ్వకుండా అన్యాయం చేస్తోందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 25 లక్షల కౌలు రైతులు ఉంటే, వారిలో 5.20 లక్షల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారని తెలిపారు. 1.80 లక్షల మందికి మాత్రమే బ్యాంకులు రుణాలు వచ్చాయన్నారు. అవి కూడా నకిలీ గుర్తింపు కార్డులు తెచ్చుకుని భూస్వాములు, ధనికులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఫేక్‌ కార్డులన్నీ తీసేస్తే లక్షలోపే వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు రుణాలు అందుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది వర్షాభావంతో పంటలు సక్రమంగా పండని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఉత్పత్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఆదుకోవడానికి చట్ట సవరణ చేయాలని, ప్రభుత్వం రుణ విమోచన చట్టాన్ని తీసుకొచ్చి ఆదుకోవాలని, ప్రత్యేక కౌలు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలూ కౌలు రైతుల సంక్షేమాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. మరో ముఖ్యవక్త, రైతు స్వరాజ్య వేదిక జాతీయ నాయకులు విస్సా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో కౌలు రైతులకు రుణాలు అందని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తమ సర్వేలో తేలిందన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందని పరిస్థితుల్లో అప్పుల పాలవుతున్న సందర్భాలను గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,200 మంది రైతులను సర్వే చేయగా వీరిలో 366 మందికి (8.8 శాతం) మాత్రమే గుర్తింపు కార్డులు అందాయన్నారు. మూడు శాతం మందికి మాత్రమే రైతు భరోసా అందుతోందని వివరించారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదన్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలపై పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చర్చకు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడంలో, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ఈ సదస్సులో సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులు అండ్ర మాల్యాద్రి, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు, శ్రామిక మహిళా నాయకులు కె.కృష్ణవేణి, సీపీఐ(ఎం) నాయకులు, రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.