చేనేతపై కేంద్రం పిడుగు

 Center thunderbolt on handloom– తొమ్మిదేండ్లలో రెట్టింపైన ముడి సరుకు ధరలు
– జాతీయ చేనేత సంక్షేమ బోర్డు రద్దు
– చేనేత వస్త్రాలపైనా జీఎస్టీ భారం
– అవసరాలున్నా ఆర్డర్లు ఇవ్వని ప్రభుత్వం
– పోచంపల్లి ఇక్కత్‌కు పేటెంట్‌ ఉన్నా కాపీకొడుతున్న వస్త్ర కంపెనీలు
– కేంద్రం చర్యలతో తీవ్రంగా నష్టపోతున్న కార్మికులు
– కేంద్రం విధానాలపై పోరాడేందుకు జాతీయస్థాయిలో స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం
– ఎస్వీకేలో నేడు అఖిల భారత చేనేత కార్మికుల కన్వెన్షన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పొద్దున లేస్తే స్వదేశీ జపం చేసే మోడీ సర్కారు వస్త్రరంగాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ చేనేత రంగాన్ని దివాళా తీయిస్తున్నది. ఆ రంగంపై పిడుగులా పడి కార్మికుల సంక్షేమం కోసం ఉన్న బోర్డునూ, పథకాలను తుంగలో తొక్కింది. ఒకనాడు దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమ నడ్డివిరిచేసి లక్షలాది మంది కార్మికుల పొట్టగొట్టింది. వస్త్రతయారీకి అవసరమైన ముడిసరుకులపైనా, తయారైన బట్టలపైనా జీఎస్టీ వేయడం ఆ పరిశ్రమకు గుదిబండగా మారింది. పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలకు పేటెంట్‌ హక్కు ఉన్నా వస్త్ర కంపెనీలు యథేచ్ఛగా కాపీ కొడుతున్నా కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు ఒక్కతాటిపైకొచ్చి అఖిల భారత చేనేత కార్మికుల జాతీయ కన్వెన్షన్‌ను హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్నారు. అఖిల భారత స్థాయిలో ఉద్యమాలు చేసేందుకు ఒక స్టీరింగ్‌ కమిటీని కూడా వేయబోతున్నారు.
పథకాల్లో ఎత్తివేత..నిధుల్లో కోత
ఎవరైనా చేనేత కార్మికుడు చనిపోతే మహాత్మాగాంధీ బునకర్‌ బీమా యోజన పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందేది. మోడీ సర్కారు అది దక్కకుండా చేసింది. ఐసీఐసీఐ లాంబాడ్‌ హెల్త్‌ స్కీం ఆరోగ్య సమస్యలున్న కన్వెన్షన్‌ను హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్నారు. అఖిల భారత స్థాయిలో ఉద్యమాలు చేసేందుకు ఒక స్టీరింగ్‌ కమిటీని కూడా వేయబోతున్నారు.
పథకాల్లో ఎత్తివేత..నిధుల్లో కోత
ఎవరైనా చేనేత కార్మికుడు చనిపోతే మహాత్మాగాంధీ బునకర్‌ బీమా యోజన పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందేది. మోడీ సర్కారు అది దక్కకుండా చేసింది. ఐసీఐసీఐ లాంబాడ్‌ హెల్త్‌ స్కీం ఆరోగ్య సమస్యలున్న చేనేత కార్మికులకు ఎంతో దోహదపడేది. దీన్నీ కేంద్రం ఎత్తేసింది. హౌస్‌ కమ్‌ వర్క్‌షెడ్‌ పథకం కింద చేనేత కార్మికునికి లక్షా 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందేది. మోడీ సర్కారు దీన్నీ కాల రాసింది. గతంలో 22 రకాల రిజర్వేషన్‌ ఉండేది. మోడీ సర్కారు వచ్చాక 11 రకాల చేనేత రిజర్వేషన్‌ మాత్రమే అమలు చేస్తున్నది. వాస్తవంలో ఐదారు రకాలకే వర్తిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి ఏటేటా నిధులను తగ్గిస్తూ పోతున్నది. 2022-23 బడ్జెట్‌లో చేనేత రంగానికి కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించబడ్డాయి. అది కూడా చేనేత, టెక్స్‌టైల్‌ రంగాలకు రెండింటికీ కలిపి కేటాయిస్తున్నది. ఆ నిధుల్లోనూ టెక్స్‌టైల్‌ రంగానికి ఎక్కువ, చేనేతకు తక్కువ నిధులు దక్కుతున్నాయి.
ముడిసరుకులపై ధరాభారం..ఆపై జీఎస్టీ బాగోతం
ఒక చేనేత వస్త్రం తయారు కావాలంటే మానవ శ్రమతో పాటు పట్టు, నూలు, రంగులు, రసాయ నాలు, తదితర ముడిసరుకులూ అవసరం పడు తాయి. మోడీ సర్కారు వచ్చిన తొమ్మిదేండ్ల కాలంలో వాటి ధరలు రెట్టింపు అయ్యాయి. దీనికితోడు పట్టుపై 12 శాతం, నూలుపై ఐదు శాతం, రంగులు, రసాయనాలపై ఐదు నుంచి 12 శాతం చొప్పున జీఎస్టీ వేస్తున్నది. వస్త్రం తయారైన తర్వాత అమ్మకానికి పెట్టే సమయంలోనూ ఐదు శాతం జీఎస్టీ భారం వేస్తున్నది. అంటే చేనేత పరిశ్రమపై పన్నుల మీద పన్నులు వేస్తూ కేంద్రం భారం మోపుతున్నది. ఈ భారంతో పవర్‌లూమ్‌, వస్త్ర మిల్లులను తట్టుకుని చేనేత కార్మికులు మార్కెట్‌లో నిలవలేకపోతున్నారు. దీంతో ప్రజలు చేనేత వస్త్రాలకు క్రమంగా దూరం అవుతున్నారు. దీనిని బట్టే కార్పొరేట్‌ వస్త్ర పరిశ్రమ వైపు కేంద్రం పక్షపాతం చూపిస్తూ చేనేతను నాశనం చేస్తున్నదని ఇట్టే అర్ధమవుతున్నది.
జాతీయ చేనేత బోర్డు రద్దు
వివిధ రాష్ట్రాల్లో చేనేత కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో చేనేత బోర్డు గతంలో ఉండేది. ఆయా రాష్ట్రాల నుంచి ఆ బోర్డులో ప్రతినిధులు ఉండేవారు. వారు ఆయా రాష్ట్రాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం తీసుకోవా ల్సిన చర్యలపై చర్చించి కేంద్రానికి సూచించేవారు. అందులో చాలా మేరకు సమస్యలకు పరిష్కారం లభించేది. మోడీ సర్కారు వచ్చాక ఆ బోర్డును రద్దు చేసి చేనేత కార్మికుల గొంతును నొక్కేసింది.
సర్కారుకు బట్ట అవసరమున్నా..నేతన్నలపై పెద్ద చూపేది?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వస్త్రాల అవ సరం ఉంటుంది. ఆస్పత్రుల్లో బెడ్‌షీట్లు, ఇతర అవస రాలకు బట్టలు అవసరం. కానీ, ప్రభుత్వాలు మాత్రం చేనేతకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేసే ఆశాలు, అంగన్వాడీలకు, గ్రామ పంచాయతీ, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే యూని ఫామ్‌ ల ఆర్డర్లను చేనేత కార్మికులకు ఇస్తే ఎంతో మంది ఉపాధి కల్పించి వారి జీవనోపాధిని మెరుగు పర్చ వచ్చు. పాలకులు ఈ దిశగా ఆలోచించడం లేదు.
తెలంగాణలో సహకార వ్యవస్థ నిర్వీర్యం
మన రాష్ట్రంలో 382 చేనేత సహకార సంఘా లున్నాయి. వాటికి ప్రతి ఐదేండ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలి. కానీ, ఈ ప్రక్రియ తొమ్మిదేండ్లుగా అటకెక్కింది. దీంతో సహకార వ్యవస్థ రాష్ట్రంలో కుంటుపడింది. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. కానీ, బిల్లులను మాత్రం ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు పెండింగ్‌లో ఉన్న ఘటనలున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు రూ.25 కోట్ల దాకా ఉన్నట్టు సమాచారం. సహకార సంఘాలకు చెందిన రూ.72 కోట్ల రుణాల మాఫీ చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో వస్తున్నా సర్కారు ఆ వైపు దృష్టి సారించడం లేదు.
చేనేత రంగంపై కేంద్రం తీరు కక్షపూరితం
కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై కక్షపూరితం గా వ్యవహరిస్తున్నది. సంక్షేమ పథకాలను, బడ్జెట్‌లో నిధులను తగ్గిస్తూ పోతున్నది. చేనేత బోర్డును ఎత్తేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికు లను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పోరాడేందుకే చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికుల అఖిల భారత కన్వెన్షన్‌ను నిర్వహిస్తున్నాం. అందులో భవిష్యత్‌ పోరాట కార్యచరణను రూపొందిస్తాం. వెంటనే చేనేత బోర్డును ఏర్పాటు చేయాలి.చేనేత, టెక్స్‌టైల్‌ రంగాలకు వేర్వేరుగా బడ్జెట్‌ కేటాయిం చాలి. పోచంపల్లి ఇక్కత్‌ పేటెంట్‌ హక్కును కాల రాస్తూ దొంగతనంగా ప్రింట్‌ వేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో 30 వేల వరకు మగ్గాలకు జియోట్యాగింగ్‌ చేశారు. ఇంకా ఏడెనిమిది వేల మగ్గాలకు చేయాల్సి ఉంది. సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి. వెంటనే ఎన్నికలు నిర్వహిం చాలి. రుణాలను మాఫీ చేయాలి. చేనేత ముడిసరు కుల విక్రయ కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలి. వాటిని సబ్సిడీపై ఇస్తే నేత కార్మికులకు ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ, గ్రామ పంచా యతీ కార్మికులకు, ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వారికి చేనేత వస్త్రాలను యూనిఫాంగా ఇవ్వాలి. చేనేత కార్మికులకు చేనేత బంధు కింద రూ.10 లక్షల పెట్టుబడి సహాయాన్ని అందించాలి. చేనేత కార్మికుల కు మినిమం వేజ్‌ అమలు చేయాలి. 22 రకాల రిజర్వేషన్‌ను కేంద్రం కొనసాగించాలి.
చెరుపల్లి సీతారాములు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు