– రాజకీయాల్లో మతాన్ని జొప్పించి లబ్దిపొందే యత్నం : కేవీపీఎస్
నవతెలంగాణ-ముషీరాబాద్
రాజ్యాంగ విలువలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం, లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మతోన్మాద ప్రమాదం-నేటి సవాళ్లు’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. అన్ని మతాల ప్రజలు గ్రామాల్లో సోదరభావంతో ఉంటారని, వారి మధ్య మత విద్వేషాలు పెట్టి చీల్చుతున్నారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం కులమతాలకతీతంగా ప్రజలంతా ఉద్యమం చేశారనే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీశాయని చెప్పారు. దేేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మహిళలపై లైంగికదాడులకు పాల్పడిన వారికి బీజేపీ ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయని విమర్శించారు.
ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ మాట్లాడుతూ.. వికలాంగుల పేరు దివ్యాంగులుగా మర్చి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. దేశ వ్యాప్తంగా వికలాంగుల కోసం ఉన్న 9 విద్యాసంస్థలను విలీనం చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని, వికలాంగుల చట్టాలను అమలు చేయడం లేదని అన్నారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణం అమలు చేయాలన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకటేష్, సాయమ్మ, జెర్కొని రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.మధుబాబు, కాషాప్ప, నాగలక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాలేశ్వర్, దశరథ్ పాల్గొన్నారు.