రైల్వే అధికారుల నియామకాలపై కేంద్రం యూటర్న్‌

– యూపీఎస్‌సీ ద్వారా ఇకపై రెండు పరీక్షల నిర్వహణ
న్యూఢిల్లీ : రైల్వే అధికారుల నియామక విధానంపై కేంద్రం యూటర్న్‌ తీసుకుంది. రైల్వే ఉద్యోగాలలో నియామకాలకు సంబంధించి సుమారు ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఎనిమిది రైల్వే సర్వీసులను ఒకే సివిల్‌ సర్వీస్‌గా విలీనం చేస్తూ ఐదు సంవత్సరాల క్రితం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే 2019లో తీసుకున్న క్యాబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా రైల్వే సర్వీసులలో నియామకాలను రెండు వేర్వేరు పరీక్షల ద్వారా చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. సాంకేతికేతర సర్వీసులకు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు (సీఎస్‌ఈ), సాంకేతిక సర్వీసులకు ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్షలు (ఈఎస్‌ఈ) నిర్వహిస్తారు. ఈ పరీక్షలను యూపీఎస్‌సీ చేపడుతుంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం టెలీకమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాసింది. దానిపై ‘ఎలాంటి జాప్యం లేకుండా’ అని పేర్కొంది. ఈఎస్‌ఈకి టెలీకమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ నోడల్‌ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తుంది.రైల్వే శాఖలో సాంకేతిక, సాంకేతికేతర సిబ్బంది అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతున్నామని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ తన ఆఫీస్‌ మెమొరాండంలో తెలియజేసింది. సర్వీసుల విలీనం తర్వాత సాంకేతిక అధికారుల కొరత పెరిగిన నేపథ్యంలో విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.