కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి

On Kerala Govt The center is authoritarian– 8న హైదరాబాద్‌లో నిరసన
– హాజరు కానున్న బివి రాఘవులు : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేరళలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. కేంద్రం వివక్షాపూరిత విధానాలు, రాష్ట్రాల హక్కులపై దాడులకు వ్యతిరేకంగా ఈనెల ఎనిమిదిన రాష్ట్రకేంద్రాల్లో సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని గుర్తు చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగే ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ధర్నాను జయప్రదం చేయాలని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత, అణచివేత ధోరణి కొనసాగిస్తున్నదని విమర్శించారు. గతంలో ఎదుర్కొన్న విపత్తులు, కష్టకాలంలోనూ కేరళ రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయకుండా మొండిచెయ్యి చూపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆటంకం కలిగిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం ఆదాయం, ఉత్పత్తి విషయాల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిరదని తెలిపారు. 2021-22 నుంచి కేరళ రుణ పరిమితిని తగ్గించిందని వివరించారు. జీఎస్టీ వంటి ఆదాయ వనరులను తగ్గించిందని పేర్కొన్నారు. పన్ను వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన వాటాను 41 శాతానికి తగ్గించిందని తెలిపారు. ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంట్‌లను ప్రయోగించడం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్‌ మితిమీరిన జోక్యం తదితర అంశాల వల్ల ప్రభుత్వ పనివిధానంపై ప్రభావం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు కేంద్ర ఆదాయంలో మూడో వంతును సెస్సు, సర్‌చార్జీకి బదిలీ చేశారని తెలిపారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం విద్వేషపూరిత వైఖరిని అనుసరించడం సరికాదని పేర్కొన్నారు. మేధావులు, యువకులు, ప్రజాస్వామికవాదులు మౌనం వహించకుండా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిరచాలని ఆయన కోరారు.