– త్వరలో నిబంధనలు : కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. డీప్ ఫేక్ వీడియోలను సృష్టించే వారికి, ఆ వీడియోల వ్యాప్తికి కారణమయ్యే సామాజిక మాధ్యమాలకు భారీ జరిమానా విధించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. డీప్‌ఫేక్ వీడియోల కట్టడిపై చర్చించేందుకు కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. సామాజిక మాధ్యమ సంస్థలు, నాస్కామ్, కృత్రిమ మేథ (ఏఐ)పై పనిచేసే నిపుణులతో చర్చించింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. మన ప్రజాస్వామ్యానికి డీప్ ఫేక్ సరికొత్త ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కట్టడి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘సామాజిక మాధ్యమ సంస్థలతో జరిగిన సమావేశంలో మేం నాలుగు అంశాలపై కీలకంగా చర్చించాం. డీప్ ఫేక్‌లను గుర్తించడం, వాటి వ్యాప్తిని అరికట్టడం, వాటిని నివేదించడం, అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చలు జరిపాం. రాబోయే కొన్ని వారాల్లో దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నాం. ఆ ముసాయిదా రూపకల్పనను నేటి నుంచే ప్రారంభిస్తాం. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను సవరించడమో.. లేకపోతే కొత్త చట్టం తీసుకురావడమో చేస్తాం” అని కేంద్రమంత్రి వెల్లడించారు. డిసెంబరు తొలి వారంలో దీనిపై మరోసారి చర్చిస్తామని చెప్పారు.