హామీలు అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Central and state governments have failed to implement the guarantees– సోషల్ మీడియాతో  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 
– స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండి.. మెజారిటీ స్థానాలు మనవే..!
– హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా  విఫలమయ్యాయని, హామీల అమలులో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు  ప్రభుత్వాలు తక్షణమే గద్దె దిగాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పోతారు గ్రామంలోని శుభం గార్డెన్లో జరిగిన  హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా  కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరును ఎండగట్టి, వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని గతంలో మాదిరిగా అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంకరబద్ధులై కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు ఫెయిల్యూరని, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటికీ అమలు చేయకుండా తాత్సరం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో  ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, గ్యాస్ రాయితీ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో పడటం లేదని, గృహలక్ష్మి ద్వారా ఇండ్లు కట్టించే కార్యక్రమం ఊసే లేదని, ఆసరా పెన్షన్లను ఎప్పుడు పెంచుతారని, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం మలు చేయడం లేదని  మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళా అకౌంట్లో నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతులను ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇతర అంశాల మీద దృష్టి పెట్టి, స్వీయ లాభం కోసం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వసూళ్ల పర్వాన్ని, ప్రస్తుతం ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని అన్నారు. మోసపూరిత కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని, తెలంగాణ అస్తిత్వం కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన అఖండ విజయాన్ని అందించడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనీ గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మాజీ ఎంపీపీ లకవత్ మానస, బిఆర్ఎస్ నాయకులు దుండగల రాజ్యలక్ష్మి, మండల అధ్యక్షుడు గంగం మదన్ మోహన్ రెడ్డి, అక్కన్నపేట మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.