నీలి విప్లవంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిన్న చూపు..

Central and state governments' short view on blue revolution..– జిల్లాలో మత్స్యకారుల ఇబ్బందులు..
– అంతంత మాత్రంగానే చేప పిల్లల పంపిణీ..
– నిధుల కేటాయింపే వివక్షత కారణం..
నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్రంలో ఆదాయాన్ని, ఉపాదిని కల్పించే రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మత్స్య రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. నీలి విప్లవం అంటూ ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నిధుల కేటాయింపులో వివక్షత చూపుతున్నారు. ఇది మత్స్యకారుల కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాలు..
గ్రామీణ ప్రాంతాలలో మత్స్యకారులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలను, ఆదాయాన్ని పెంచే విధంగా నీలి విప్లవంపై ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ అవి నత్తనడక నడుస్తున్నాయి. మత్స్యకారుల పట్ల పాలకుల నిర్లక్ష్యం అడుగడుగున కనబడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీలి విప్లవం ద్వారా చేప పిల్లల పంపిణీ, ఫిష్ సీడ్ హేచరీస్ ఏర్పాటు, ఫిష్ కల్చర్ చెరువుల నిర్మాణం, రెగ్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టం యూనిట్లను, బయో ఫ్లోక్ యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము మత్స్య సంపదను పెంపొందించడానికి కృషి చేయడంలో భాగంగా చేప పిల్లల పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టింది. ప్రస్తుతం కేంద్రము, రాష్ట్రము ఈ నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి.
జిల్లాలో 650 చెరువులు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపల పెంపకానికి 650 చెరువులు అనుకూలంగా ఉన్నాయి.  వీటిలో సుమారు 20 చెరువులకు నీటి కొరత ఉంది. జిల్లాలో 186 సొసైటీలు, పెద్ద ఎత్తున మత్స్యకారులు ఈ చేపల పెంపకంపై ఆధారపడి ఉన్నారు.
నామమాత్రంగా చేప పిల్లల పంపిణీ..
ఈ చెరువులకు సుమారుగా  మూడు కోట్ల చేప పిల్లల అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కోటి యాభై లక్షల చేపల పిల్లల కోసం ప్రణాళిక రూపొందించింది. నిధుల కొరత కారణంగా 70 లక్షలకు కుదించింది. చివరకు ఇప్పటివరకు 60 చెరువులలో 40 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేశారు. రెండు కోట్ల 60 లక్షల చేప పిల్లలకు నేడు ఎగనామం పెట్టారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ చెరువులలో బొచ్చ, రోగు, మెంగల, బంగారు తీగ రకాలను పంపిణీ చేశారు. 80 ఎంఎం, 35 ఎంఎం సైజులలో చేపలను పంపిణీ  చేశారు. 35 ఎంఎం చేప  పిల్లల యొక్క డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ కమిషనర్ ఆఫీస్ నుండి తగినంతగా సరఫరా చేయలేదు.
జిల్లాలో ఫిష్ సీడ్ హేచరీస్ ఏర్పాటు చేయాలి: ఎండీ జహంగీర్.. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి. అందుకు తగినంత నిధులు కేటాయించడంతోపాటు నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేయాలి. జిల్లాలో గంధంమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల వద్ద ఫిష్ సీడ్ హచరిస్ ఏర్పాటు చేయాలి. మత్స్యకారులకు ప్రోత్సాహం కింద వాహనాలతో పాటు ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేసి, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. వారికి సబ్సిడీతో చేప పిల్లలను అందించాలి.