కేంద్రం నిరంకుశత్వం- కేరళ వామపక్ష ప్రభుత్వ పోరాటం

Autocracy at the Center – Struggle of Kerala Left Government2024 నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేరళ పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నది. భారతదేశం అంటే రాష్ట్రాల సమైక్య అనే రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తున్నది. ఫెడరలిజానికి తూట్లు పొడిచి రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నది. కేరళ భారత దేశంలో అంతర్భాగమన్న విషయాన్ని కూడా గమనించకుండా దాడి చేస్తున్నది. కేరళ ప్రజల పట్ల కాషాయ పార్టీ కక్షగట్టింది. ఆ రాష్ట్రానికి రావలసిన నిధులు గానీ, ఇతర రూపాలలో సహాయ, సహకారాలు గానీ అందకుండా చేస్తున్నది. రాజకీయంగా అస్థిరపర్చడం కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ముఖ్యమంత్రి, మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అక్రమంగా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. గవర్నర్ల ద్వారా పరోక్షంగా పరిపాలించాలని చూస్తున్నది.
ఈ పరిస్థితుల్లో ‘కేరళ ప్రజల హక్కులకు అండగా నిలబడదాం- వామపక్ష ప్రత్యామ్నాయ విధానాలను బలపరుద్దాం’ అనే నినాదంతో సీఐటీయూ- ఏఐకెఎస్‌-ఏఐఏడబ్ల్యుయూ అఖిల భారత కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో 2024 డిసెంబర్‌ 11నుంచి 21(నేటి) వరకు కార్మిక, కర్షక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి,యువజన, మేధావి వర్గమంతా కూడా ”కేరళ సంఘీభావ దినం” పాటిస్తున్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేరళ అవలంభిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలను గ్రామస్థాయి వరకు చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. వామపక్ష ప్రభుత్వమే కాకుండా ఇతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల పట్ల కూడా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కేరళ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల హక్కుల కోసం కూడా పోరాడుతున్నది.
కేరళ అభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలు
కేరళ అనేక రంగాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా కేరళ ముందున్నది. విద్యారంగంలో వంద శాతం అక్షరాస్యత సాధించింది. వైద్య రంగంలో దేశంలోనే మెరుగైన ఫలితాలు సాధించింది. విద్యారంగం కోసం ఎనిమిదేండ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు పెంచింది. పది లక్షల మంది కొత్తగా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. వైద్య రంగం కోసం భారీగా బడ్జెట్‌ పెంచింది. ప్రతి పంచాయతీలో హెల్త్‌ సెంటర్స్‌ పెట్టి ఫుల్‌ టైం డాక్టర్లను నియమించింది. కరోనా సమయంలో ఐదువేల పారామెడికల్‌ పోస్టులు భర్తీచేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నది. విద్య, వైద్య సేవల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. వామపక్ష ప్రభుత్వ కాలంలో 2,27,800 పోస్టులు భర్తీ చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధిక నిధులు డైరెక్ట్‌గా స్థానిక సంస్థకే చెల్లిస్తూ గ్రామ స్వయం సంపూర్ణ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసింది. ఇప్పుడు దేశమంతా కేరళవైపు చూస్తోంది.
కేరళలో లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక రంగాల్లో ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసింది. పారిశ్రామిక రంగంలో 12శాతం నుండి 17శాతం అభివృద్ధి సాధించింది. ప్రభుత్వరంగ సంస్థలను లాభాల బాట పట్టించింది. గతంలో ఎనిమిది సంస్థలు మాత్రమే లాభాల్లో ఉంటే ప్రస్తుతం 41 సంస్థలు లాభాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,40,000 చిన్న పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. రూ.92 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 1,39,840 స్టార్టప్‌లు ప్రారంభించినందున రూ.8,422 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మందికి కొత్తగా ఉపాధి వచ్చింది. ఇండిస్టీ ఫ్రెండ్లీ లిస్టులో 23వ స్థానంలో ఉన్న కేరళ నేడు ప్రథమ స్థానంలో ఉంది.
2016 నుండి రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు, ఆ పైన అమలు చేస్తున్నది. అసంఘటిత రంగంలో కార్మికుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసింది. కో-ఆపరేటివ్‌ సొసైటీలు ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నది. వ్యవసాయ రంగంలో కూడా వామపక్ష ప్రభుత్వం గణనీయమైన ప్రగతి సాధించింది. వ్యవసాయ రంగం అభివృద్ధి 2శాతం నుండి 4.64శాతం పెరిగింది. 1.7 లక్షల హెక్టార్ల నుండి 2.5 లక్షల హెక్టార్లకు వరి సాగు విస్తరించింది. కూరగాయల పంటల విస్తీర్ణం 60 వేల హెక్టార్ల నుండి 1.2 లక్షల హెక్టార్లకు పెరిగింది. కూరగాయలు, ఇతర ఉత్పత్తులు భారీగా పెరిగాయి. క్వింటాల్‌ వరి ధాన్యంకు రూ.2,850 ఇస్తూ దేశంలోనే అత్యధిక గిట్టుబాటు ధర ఇస్తున్న రాష్ట్రంగా కేరళ ఉంది. ‘రైతుల సంక్షేమ నిధి’ ఏర్పాటు చేసి రూ.5వేలు పెన్షన్‌ కూడా ఇసున్నది. దేశంలో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ ఒక్కటి మాత్రమే.
కేరళ వామపక్ష ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టిపెట్టింది. వారి జనాభా కన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తూ బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలుస్తోంది. ఎస్సీల ఇండ్ల కోసం రూ.770 కోట్లు ఖర్చు చేసింది. 56,994 కుటుంబాలకు ప్రయోజనం కలిగించింది. 3,937 ఎకరాల భూమి గిరిజనులకు పంపిణీ చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు నాణ్యమైన బియ్యం అందిస్తున్నది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో ప్రజా పంపిణీకి రూ.5,242 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం రూ.10,697 కోట్లు కేటాయించింది. నిత్యావసర సరుకులు తక్కువ ధరకే ఇస్తున్నది. రూ.4 లక్షలతో పేదలకు 4లక్షల 60వేల పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చింది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలో ఇప్పటికీ 25శాతం పేదరికం ఉంటే కేరళలో మాత్రం 0.71శాతం మాత్రమే. 64 వేల కుటుంబాలను అత్యంత నిరుపేద కుటుంబాలుగా గుర్తించి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్న సర్కార్‌ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్టుల పాలనలోని కేరళ మాత్రమే.
యుపిఎ హయాంలో వామపక్షాలు పోరాడి సాధించిన చట్టాల్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నదో చూస్తూనే ఉన్నాము. ఉదాహరణకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పనిదినాలు తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ పథకానికి సంబంధించి ప్రతియేటా బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ వస్తున్నది. కానీ, కేరళలో మాత్రం ఉపాధి పథకం సమర్థవంతంగా అమలవుతున్నది. దేశంలో సగటు పని దినాలు 45 ఉంటే కేరళలో 67 రోజులు పని కల్పిస్తున్నది. ఇప్పటివరకు రూ.9.94 కోట్లు కేటాయించింది. ప్రతి ఏడాది ఇందుకోసం రూ. వెయ్యి కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నది. ప్రారంభించిన పనుల్లో 91శాతం పూర్తి చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేస్తూ 26.4 లక్షల ఉపాధి పనిదినాలు కల్పించింది. ఉపాధి కూలీలకు కేరళ ఒక్కటే పండుగ అలవెన్స్‌ కింద ఏడాదికి రూ.వెయ్యి అందిస్తున్నది. కేంద్రం సహాయం చేయకపోయినా ఈ విధంగా తమకున్న వనరులతో అభివృద్ధి పథంలో నడుపుతున్నది. కేంద్రం నుండి తమకు రావలసిన వాటా నిధులు రాకపోవడంతో ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్నది. కానీ, ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలబడిన తీరు వారి చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
కేంద్రం వివక్షతపై సుప్రీంకోర్టుకు…
కేరళ ప్రభుత్వానికి రావాల్సిన వాటా రూ.57,400 కోట్లు కేంద్రం చెల్లించడానికి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. తమ రాష్ట్రానికి రావలసిన జీఎస్టీ పర్సంటేజి తగ్గిస్తున్నది. కేంద్రం ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా రావలసిన నిధుల పర్సంటేజిని కుదిస్తున్నది. 10వ ఫైనాన్స్‌ కమిషన్‌ పిరియడ్‌లో 3.875శాతం ఉండేది. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌లో 2.5శాతానికి, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నాటికి 1.925శాతానికి తగ్గించింది. రాష్ట్రాల నుండి కేంద్రానికి 62.7శాతం ఆదాయం సమకూరితే తిరిగి రాష్ట్రాలకు 37.3శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నది. కేరళకు జీఎస్టీ నష్టపరిహారం 2022లో నిలుపుదల చేసింది. దీంతో రూ.9 వేల కోట్లు నష్టపోయింది. గత ఐదేండ్లుగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు తగ్గిస్తూ వస్తున్నది. అప్పులు తీసుకురావడానికి కూడా అనుమతించడం లేదు. కరోనా సమయంలో కూడా వివక్షత చూపింది. రాష్ట్రానికి చెందిన ప్రజలు సౌదీ, ఇతర దేశాల్లో ఉన్నవారు సహాయం చేయడానికి ముందుకొచ్చి రూ.220 కోట్ల నిధులు సమీకరిస్తే కేంద్రం అనుమతించకుండా అడ్డుపడింది. వయనాడ్‌ వరదల్లో 400 మందికి పైగా చనిపోగా వందవరకు గల్లంత య్యారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,138 కోట్లు అడిగితే రూ.100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. అదే పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుకు మాత్రం పెద్ద ఎత్తున సహాయం చేసింది. ప్రధానమంత్రి పర్యటించిన ఖర్చులు రూ.40 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బిల్లు పంపింది. గవర్నర్‌ ద్వారా నిత్యం ఆటంకాలు సృష్టిస్తూ, అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులను అడ్డుకుంటూ పాలనలో జోక్యం చేసుకుంటున్నది.
వామపక్ష ప్రభుత్వ ప్రతిఘటనలు
దశాబ్దాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడింది. వాటిలో కార్మిక హక్కులు కాలరాస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చింది. మూడు వ్యవసాయ సాగు చట్టాలు తెచ్చింది. విద్యుత్‌ సవరణ బిల్లు, నూతన విద్యా విధానం బిల్లు, డిజిటల్‌ హెల్త్‌ పేరిట విద్యా, వైద్య రంగాల ప్రయివేటీకరణకు పాల్పడింది. ఈ విధానాలపై కేరళ వామపక్ష ప్రభుత్వం ముందునుంచే పోరాడుతున్నది. బీజేపీ కార్పొరేట్‌ విధానాలను ప్రతిఘటిస్తున్నది. మతోన్మాద దుశ్చర్యలను అడ్డుకుంటున్నది. సిఎఎ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలు చేసింది. సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. ఇప్పుడు కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం ప్రజల మద్దతుతో పోరాడుతున్నది. అందుకు గాను కేరళ ప్రభుత్వానికి అండగా నిలబడాలి. కేరళ ప్రజలకు సంఘీభావం తెల్పాలి. నిత్యం ప్రజల కోసమే పాటుపడే ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవాలి.
భూపాల్‌
9490098034