– ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
– కనీస నిధులు కేటాయించడం లేదు
– అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది..?
– పోడుభూమికి పట్టాలు ఇవ్వాలి
నవతెలంగాణ-బెజ్జూర్
వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీలో మెయింటినెన్స్ కోసం కూడా నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. డీఎంఎఫ్‌టీ నిధులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు కేటాయించాల్సిన ఏసీడీపీ నిధులు సైతం ఆరు నెలల నుంచి కేటాయించడం లేదని, దీంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. పారిశుద్ధ పనులకు నిధులు లేక గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా ఉందన్నారు. నిధుల కోసం అడిగితే రుణమాఫీ తర్వాతే నిధులు కేటాయిస్తామని చెప్తున్నారన్నారు. కేవలం రూ.7000 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని తెలిపారు. ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ విడతల వారీగా రుణమాఫీ చేస్తామని ఇప్పుడు చెప్తున్నారన్నారు. దీంతో చాలామంది రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ చేస్తామని చెప్పడం విడ్డూరమని, దీంతో చాలామంది రైతులు రుణమాఫీకి అర్హత సాధించలేక నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పోడుభూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందించినట్లు పేర్కొన్నారు. 90 అంశాలతో కూడిన ప్రశ్నలను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని, సీఆర్‌ఎఫ్ నిధులు కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. సోమిని గ్రామంలో పాఠశాల ఎడ్ల కొట్టంలో కొనసాగుతుందని ఇదే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సింహంగా మారుతుందన్నారు. అనంతరం సోమిని రహదారిని పరిశీలించారు. అటవీ అనుమతులు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండ్ర మనోహర్ గౌడ్, కొప్పుల శంకర్, సామల తిరుపతి, జాడి దిగంబర్, శ్రావణ్, భాస్కర్, రాజు, నేరెళ్ల, సంతోష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.