నవతెలంగాణ – కంటేశ్వర్
శత శాతం లబ్దిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర ఆహార & ప్రజాపంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్వని శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఇందల్వాయి మండలం, అన్సాన్ పల్లె గ్రామంలో కొనసాగిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములయ్యారు. కేంద్ర ఆహార & ప్రజాపంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్వని శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా విచ్చేయగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, ఎల్ డిఎం శ్రీనివాస రావ్ తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర ఆహార & ప్రజాపంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అశ్వని శ్రీవాస్తవ మాట్లాడుతూ….కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వంద శాతం లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. అర్హులై సంక్షేమ పథకాలు లబ్ధి పొందని వారు ఉండకూడదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పట్టణ మరియు గ్రామగ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, పక్కా ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టికాహారం, వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులు వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభవాలను, అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర పథకాల ద్వారా ప్రయోజనం పొందిన పలువురు లబ్ధిదారులతో మాట్లాడించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు, గోడప్రతులు, క్యాలెండర్లను ఆవిష్కరించి, ప్రజలకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించారు.సంకల్ప యాత్ర కార్యక్రమాలలో యంపీడిఓ శ్రీరాములు, సర్పంచ్, డియల్ పిఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల్ అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.