విశాఖపట్నం : పోరాటాలతో ఏర్పాటైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1289వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో ఎఐటియుసి కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, దానిలో భాగంగానే సొంత గనులు కేటాయించడంలేదని తెలిపారు. రా మెటీరియల్‌ను తగినంతగా సరఫరా చేయకపోవడం వల్ల ఉక్కు ఉత్పత్తికి తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా తన తీరును మార్చుకుని కర్మాగారాన్ని పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని, ఆర్థిక వనరులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు మసేన్‌రావు, జె రామకృష్ణ, కె రాజబాబు, తాండ్ర కనకరాజు, బిఎంఎల్ నాయుడు, వరప్రసాద్, చీకటి శ్రీనివాసరావు, వి కృష్ణంనాయుడు పాల్గొన్నారు.