కేంద్రం గుప్పెట్లోకి గ్రంథాలయాలు రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి లైబ్రరీలు

Centrally located libraries From the state list Libraries into a common list– బిల్లు తెచ్చేందుకు కేంద్రం యోచన
– సమాఖ్య వ్యవస్థపై పోటు
– సంఫ్‌పరివార్‌ ఎజెండాను అమలకు యత్నం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గ్రంథాలయాలను త్వరలో కేంద్ర ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకోనున్నది. రాష్ట్ర సార్వభౌమాధికారంలోని అంశాల్లోకి చొరబడేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా, సమాఖ్య వ్యవస్థపై పోటుగా పలువురు దీనిని పరిగణిస్తున్నారు. గ్రంథాలయాల పనితీరులో జోక్యం చేసుకోవడానికి, సంఫ్‌ు పరివార్‌ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి విస్తృత ఎజెండాలో భాగమే ఈ చర్య అని చాలా మంది అభిప్రాయపడ్డారు. పుస్తకాలు, ప్రచురణలతో సంఫ్‌ు పరివార్‌ ఎజెండాను ప్రచారం చేసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాల పరిధిలోని లైబ్రరీల వ్యవస్థను ఉమ్మడి జాబితా (కాంకరెంట్‌ లిస్ట్‌)కి బదిలీ చేసేందుకు, తన పరిధిలోకి తీసుకునేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఢిల్లీలో జరిగిన రెండు రోజుల ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ లైబ్రరీస్‌- 2023’లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన గ్రంథాలయాల ప్రతినిధులు హాజరైన సందర్భంగా, లైబ్రరీలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేయడంపై చర్చలు జరిగాయి. రాజా రామ్మోహన్‌ రారు లైబ్రరీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ అజరు ప్రతాప్‌ సింగ్‌ లైబ్రరీ లను సాంస్కృ తిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకు రావా లనే ప్రభుత్వ సంకల్పా నికి సంకే తాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర గ్రంథాల యాలను తీర్మానం చేసి కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలనకు సమర్పిం చాలని కోరినట్టు సమాచారం. ఈ సమావేశానికి ఏపి నుంచి ఎవరూ హాజరు కాలేదు. తెలంగాణ నుంచి గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ అయాచితం శ్రీధర్‌, 14 జిల్లాల గ్రంథాలయ చైర్మెన్లు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ ఉద్యమం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్‌ లైబ్రరీలు మునిసిపల్‌ కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలచే నిర్వహించబడు తున్నాయి. 1956లో అవిభక్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని 11 జిల్లాల్లో మద్రాసు పౌర గ్రంథాలయాల చట్టం, తెలంగాణ ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌ చట్టం అమలులో ఉన్నాయి. సమ్మిళిత చట్టం కోసం, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ లైబ్రరీస్‌ చట్టం 1960లో రూపొందించబడింది. ఈ చట్టం 1964, 1969, 1987, 1989, 2016లో వరుసగా సవరించబడింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత, తెలంగాణ గ్రంథాలయాల కోసం ప్రత్యేక చట్టం రూపొందించబడింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ ఉద్యమం అన్ని ప్రాంతాలకు విస్తరించిన ప్రజా ఉద్యమంగా మారింది. ఆంధ్రాలో పబ్లిక్‌ లైబ్రరీ ఉద్యమం విజయం 19వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. తరువాతి దశాబ్దాలలో ఇది క్రమంగా పెరి గింది. 1800లో పరవస్తు కుటుంబానికి చెందిన ఒక ప్రయివేట్‌ లైబ్రరీ ప్రజల కోసం తెరవబడింది. ఇది తరువాత ఆర్ష గ్రంధాలయంగా అభివృద్ధి చేయబడింది. రాజా రామేశ్వర రాయలు (1821-1865) లైబ్రరీ కూడా వనపర్తి, మహబూబ్‌నగర్‌లలో ప్రజలకు తెరిచారు.
తీవ్రంగా వ్యతిరేకించిన కేరళ
లైబ్రరీలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేయడాన్ని కేరళ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేరళ స్టేట్‌ లైబ్రరీ కౌన్సిల్‌ కేంద్రం నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌. బిందు కేంద్రం చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో విభేదించారు. కేరళలో లైబ్రరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలనా వ్యవస్థ ఉందని, లైబ్రరీ వ్యవస్థను ఉమ్మడి జాబితాలో చేర్చడంతో ప్రజాస్వామ్య స్వభావాన్ని, వైవిధ్యాన్ని తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇది రాష్ట్రాల అధికారాలు, గ్రంథాలయాల స్వాతంత్య్రానికి భంగం కలిగించడమేనని మంత్రి అన్నారు. ఇది రాష్ట్రంలోని లైబ్రరీలు స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే గ్రంథాలయాలు స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయని అన్నారు. పుస్తకాలు కొనుగోలు చేసేందుకు నిధుల పంపిణీలో కూడా వివక్ష చూపే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో భారతదేశ ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంతోపాటు గ్రంథాలయాలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
దేశంలో 46,746 లైబ్రరీలు
దేశం వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 46,746 లైబ్రరీలు ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 12,191 లైబ్రరీలు ఉన్నాయి. కేరళలో 8,415, కర్నాటకలో 6,798, తమిళనాడులో 4,622, గుజరాత్‌లో 3,464 లైబ్రరీలు ఉండగా, ఏపీలో 978, తెలంగాణలో 672 లైబ్రరీలు ఉన్నాయి. ఏపీలో 13 జిల్లా, 4 డివిజనల్‌, 178 సిటీ, టౌన్‌, 782 గ్రామీణ లైబ్రరీలు ఉన్నాయి. తెలంగాణలో ఒక స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, 31 జిల్లా, రెండు డివిజనల్‌, 537 సిటీ, టౌన్‌, 99 గ్రామీణ, రెండు ఎన్‌జిఓ, ట్రస్ట్‌లు నడుపుతున్న లైబ్రరీలు ఉన్నాయి.