కొత్త మలుపుల్లో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు

కొత్త మలుపుల్లో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలుఎన్నికలు ముగిసి కొత్త సభలు కొలువు తీరిన సందర్భం. ఏపీ శాసనసభ సభ్యుల ప్రమాణాలతో వాయిదా పడగా పార్లమెంటు ఉభయ సభలు వాడివేడిగా నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాల తొలి అడుగులు వాటి పనితీరు ఎలావుండబోయేది సంకేతప్రాయంగా చెబుతున్నాయి. సొంత మెజార్టీ కోల్పోయి మిశ్రమ సర్కారుగా మారినప్పటికీ మోడీ ప్రభుత్వం మౌలికంగా హిందూత్వ కార్పొరేట్‌ ఏకపక్ష నమూనాలోనే నడవబోతుందని స్పష్టమవుతున్నది.గత రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ కోరినా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించిన స్పీకర్‌ ఈసారి అనివార్యంగా ప్రజల తీర్పుతోనే రాహుల్‌గాంధీని ప్రతిపక్షనేతగా ప్రకటించాల్సి వచ్చింది.అయితే దీటైన ప్రతిపక్ష కూటమిగా ‘ఇండియా’ వున్నా ప్రజాస్వామ్య స్పూర్తితో వ్యవహరించే ప్రసక్తి లేదని లోక్‌సభ తొలిసమావేశాలనే వాయిదా వేయడం ద్వారా కేంద్రం చెప్పేసింది. దేశమంతటినీ ఆందోళన పరిచిన ‘నీట్‌’పై చర్చకు నిరాకరించడంలో నిరంకుశత్వం ప్రస్పుటమైంది. అలాగే డిప్యూటీ స్పీకర్‌ పదవికి ప్రతిపక్షాల అభ్యర్థనను పరిశీలించడానికి కూడా నిరాకరించడంలో సర్కారు సిద్ధం కాకపోవడం దాని భయాన్ని ప్రతిబింబిస్తున్నది. పదేళ్ల పోరాటం తర్వాత భారత రాజకీయ రంగంలో ప్రజాస్వామ్య లౌకిక శక్తుల పోరాటానికి ఒకింత చోటు లభించడం మాత్రం సానుకూల పరిణామంగా కనిపిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే కేంద్రంలో పాలక కూటమి అతిపెద్ద మద్దతుదారుగా వున్న తెలుగుదేశం పార్ట్టీ,దాని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీల పాలన ప్రారంభమైంది. మోడీకి సొంతంగా మెజార్టీ లేదు గనక కింగ్‌ మేకర్‌గా చంద్రబాబునాయుడు స్పీకర్‌ పదవి కోరతారని, ఏదో తేడా వస్తుందని మీడియాలో వెలువడిన ఊహాగానాలు నిజం కాలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరి పేరు తెలుగు మీడియాలో విరివిగా వినిపించినా ఆ ప్రభావం కనిపించలేదు. డిప్యూటీ స్పీకర్‌గా బీజేపీ భాగస్వామ్య పక్షాలకు అవకాశం అంటున్నారు గనక ఏం జరిగేది చూడవలసి వుంటుంది. ఏమైనా టీడీపీ,దాని తర్వాత ప్రధాన మద్దతుదారుగా ఉన్న జెడియులు ఏపీ, బీహార్‌ రాజకీయాల కోణంలో రాష్ట్రాల కోసం తప్ప కేంద్ర బీజేపీ విధానాలను ప్రభావితం చేయడం జరగదనీ, ఆ ఆలోచన శక్తి కూడా లేవని అర్థమవుతున్నది. ఆ విధమైన విధాన ప్రకటనలు సూచనలు కూడా ఏమీ వెలువడింది లేదు. ఏపీలో వైసీపీ పాలనపై శ్వేతపత్రాలను విడుదల చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిమగమై వుంది. అధికారుల నియామకాలు, బదిలీలు, పాత పాలకులకు ఏజెంట్లుగా వ్యవహరించిన వారికి హెచ్చరికలు వీటిపై దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికల అనంతర ఉద్రేకాలు ఉద్రిక్తతలు కూడా తీవ్రంగానే వుంటున్నాయి. సరైన అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో కట్టారంటూ వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ,కూల్చివేతలపై కోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చి తీర్పు రిజర్వు చేశారు. తప్పులు జరిగివుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గాని కూల్చివేతలకు దిగితే గతంలో వలెనే కక్ష సాధింపు వాతావరణం పునరావృతమవుతుందని సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ వంటి పార్టీలూ, మీడియా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కార్యాచరణ కూడా ఇప్పటికీ వెల్లడికాకపోగా అసలు శాసనసభకు వస్తారా? అనే దానిపైనే సందేహాలు నెలకొన్న విచిత్ర పరిస్థితి.
జగన్‌ లేఖ
బలం తగ్గిన తాము శాసనసభకు వెళ్లినా సమయం ఇస్తారనే నమ్మకం లేదని జగన్‌ మొదట్లోనే మాట్లాడారు.తనపై తీవ్ర దుర్భాషలాడిన వ్యక్తిని స్పీకర్‌ను చేస్తున్నారని విమర్శించారు. సభ్యుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన గాని ఇతర వైసీపీ సభ్యులుగాని మీడియాతో పెద్దగా మాట్లాడలేదు. స్పీకర్‌ ఎన్నికలోగానీ, పదవీ స్వీకారంలో గానీ పాల్గొనలేదు. తర్వాత జగన్‌ ఆయనకు లేఖ రాస్తూ తన ఆరోపణను పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే సభకు వస్తామని, లేకపోతే ప్రయోజనం వుండదని దాంట్లో సూటిగానే పేర్కొన్నారు. లోక్‌సభ ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్ష నాయకుడి హోదాకు అవసరమని భావిస్తున్న పదిశాతం సీట్లు వైసీపీకి రాలేదు గనక ఆ అవకాశం వుండదనే అభిప్రాయం బలంగా వుంది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నా చట్టపరంగా మాత్రం ఇవ్వాలని చెప్పే బలమైన ఆధారాలు లేవు. ఇప్పుడు వైసీపీకి వచ్చిన 11 సీట్ల కన్నా చాలా ఎక్కువ సీట్లు వచ్చిన సందర్భంలోనూ ప్రతిపక్షనేతకు క్యాబినెట్‌ హోదా ఇవ్వలేదు. ఉమ్మడి ఏపీ శాసనసభలో గానీ, గత రెండు లోక్‌సభలలో గానీ హోదాను ఆ కారణంగానే నిరాకరించారు. గత రెండు లోక్‌సభలలో కాంగ్రెస్‌కు 50 పైనే స్థానాలున్నా ఫలితం లేకపోయింది. ఫిరాయింపుల నిరోధ చట్టం తర్వాత పదిశాతం ఉంటేనే రాజకీయ పక్షం, లేకపోతే గ్రూపు అన్న నిర్వచనం వర్తించదని ఒక వాదన. అయితే ఆ మేరకు పాత నిబంధనలు సవరించలేదు గనక ఆ వాదన నిలవదు. గతంలో పి.జనార్థనరెడ్డి, పి.ఉపేంద్రలకు పదిశాతం లేకున్నా హోదా ఇచ్చారంటూ జగన్‌ ఇచ్చిన ఉదాహరణ కూడా పూర్తిగా నిజం కాదు. అతి పెద్ద ప్రతిపక్ష గ్రూపునేతలుగా గుర్తించడం తప్ప రాజ్యాంగబద్దమైన ప్రతిపక్ష నేతలుగా వారికి సదుపాయాలు కల్పించింది లేదు. 70 మంది సభ్యులు గల ఢిల్లీ శాసనసభలో బీజేపీకి ముగ్గురే ఉన్నా హోదా ఇచ్చిన ఉదాహరణ ఉంది. కానీ అది అంతిమంగా స్పీకర్‌ విచక్షణపైనే ఆధారపడి ఆయన ద్వారానే జరగవలసి వుంటుంది. ఏపీలో ఇప్పుడున్న అసహన వాతావరణంలో ఆ విధమైన అవకాశం లేదు. సూటిగా తిరస్కరించారు కూడా. ప్రజల తీర్పును గౌరవించి సభలో పాల్గొనాలనే అభిప్రాయమే అన్ని పార్టీలూ వెలిబుచ్చాయి.పైగా గత ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలపై సమాధానాలు చెప్పడం ఆయన బాధ్యత కూడా.ఈ నేపథ్యంలో జగన్‌ లేఖ రాజకీయంగా రాసింది మాత్రమేనా లేక దానికి కట్టుబడి సభకు వచ్చినా ప్రయోజనం ఉండదని సమర్థించుకోవడానికి ప్రయత్నమా అనేది ఆచరణలో చూడాలి.
రెండు రాష్ట్రాల సమస్యలు – బీజేపీ
కేంద్రం నుంచి ఏపీ ప్రయోజనాల సాధనకు తీవ్రకృషి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ప్రభుత్వ తప్పిదాలనూ, లోపాలను నివేదించడంతో పాటు తాము ఇచ్చిన హామీల అమలుకు తొలిసానుకూల ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నారు. విశాఖ రుషికొండ భవనాల వంటి వాటితో పాటు ఉక్కు ప్యాక్టరీని కాపాడుకోవడం వంటివి మరింత కీలకమవుతాయి. ఎన్డీయేలో కీలక భాగస్వామి అయినప్పటికీ రాష్ట్రంలో టీడీపీ నాయకత్వమే వుంది గనక లౌకికతత్వానికి, మత సామరస్యానికి భంగం కలిగించే ఎలాటి చర్యలకూ అవకాశమివ్వరాదని ప్రజాస్వామిక వాదులు ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో అసహన రాజకీయాలు, కక్ష సాధింపు వాతావరణం మారాలని, మీడియాపై ఆటంకాలు తొలగిపోవాలని ఎదురు చూస్తున్నారు. విభజిత రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాలు మారుతున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్ర పార్టీల మధ్యనే పరిభ్రమిస్తూ కేంద్రం పాత్ర మరుగుపడే పరిస్థితికి అవకాశమివ్వడం వాంఛనీయం కాదు. పోలవరంపై శ్వేతపత్రంవిడుదల చేయడం వరకూ బాగానేవున్నా ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్రపై పల్లెత్తు మాట అనకుండా వుండటం ఎలా సాధ్యం? రాజధాని నిర్మాణం,విభజన సమస్యలు హామీలు అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఇప్పటికీ వైసీపీ కేంద్రంలో బీజేపీనే మోస్తున్న తీరు చూస్తే ఏపీలో మోడీ ద్వంద్వ రాజకీయంలో మార్పులేదనే అర్థమవుతుంది.ఇదే సమయంలో తెలంగాణ గవర్నర్‌గా ఉన్న బీజేపీ నేత రాధాకృష్ణన్‌ చంద్రబాబును కలుసుకోవడం, బీఆర్‌ఎస్‌, బీజేపీ కలసి పాచికలు వేస్తున్నాయనే వార్తలు వ్యాపిస్తున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు భిన్న సంకేతాలకు ఆస్కారమిస్తున్నాయి. మరింత పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారనే వార్తల నేపథ్యంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనేది చూడవలసిందే.టీడీపీని మళ్లీ తెలంగాణలో క్రియాశీలం చేయడానికి చంద్రబాబు నిర్ణయాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా తెలంగాణ సందర్శనలు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్డీయేను ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయా? అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబుపై తనకు ఎంత గౌరవభావం ఉన్నా తన పదవికే ఎసరు తెచ్చుకునేలా ఎందుకు వ్యవహరిస్తానని రేవంత్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన ఆలోచనను వెల్లడించాయనుకోవాలి.
ప్రత్యేక పరిస్థితి
ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను సహేతుకంగా రాజ్యాంగ బద్దంగా పరిష్కరించి సహాయపడే బదులు తన స్వప్రయోజనాలకోసం కేంద్రంలోని బీజేపీ ఉభయ పక్షాలతో చెలగాటమాడటం నష్టదాయకమవుతుంది. వివిధ రాష్ట్రాలలో తనతో చేతులు కలిపిన ఎజిపి, జెడిఎస్‌,బిఎస్‌పి,జెడియు వంటి పార్టీలను పథకం ప్రకారం దెబ్బతీస్తూ వస్తున్న బీజేపీ తెలుగు రాష్రాల్లో కూడా అంతకంటే భిన్నంగా వ్యవహరిస్తుందనుకోవడం పొరపాటు. పైగా సొంతబలం తగ్గిన దృష్ట్యా ఈ తరహా కుటిల రాజకీయాలు ఇంకా తీవ్రం కావచ్చు కూడా. ఎన్నికల అవసరాల కోసం బీజేపీతో చేరి మోడీ మూడో సర్కారుకు ప్రధాన ప్రాపుగా మారిన టీడీపీకి ఈ వాస్తవాలు తెలియవని భావించలేము. ఇక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న వైసీపీ మనుగడ కోసం, కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీని మరింత బలపర్చడమే తరుణోపాయమని భావించడం కూడా విచిత్రమే.తాము కాంగ్రెస్‌లో కలసిపోతామని కొందరు ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న మాటలు నిజం కాదని కూడా వైసీపీ వారంటున్నారు. బీఆర్‌ఎస్‌ తదుపరి అడుగుల విషయంలోనూ చాలా సందేహాలున్నాయి. ఏతావాతా రెండు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకునే దిశలోనే బీజేపీ అడుగులేస్తున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను మరోసారి సిబిఐ అరెస్టు చేయడంలోనూ ఆయా పార్టీలను ఒత్తిడి పెట్టే ఎత్తుగడ వుంది. మోడీ సర్కారు మతతత్వ కార్పొరేట్‌ ఏకపక్ష విధానాలపై పోరాడేందుకు తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత వెసులుబాటు పెరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఈ పరిస్థితులను ప్రత్యేకంగా చూడవలసిన అగత్యమేర్పడుతున్నది.కనుకనే ఇక్కడ వామపక్ష లౌకిక శక్తులు, ప్రజాస్వామ్య ప్రియులు మరింత అప్రమత్తత వహించాల్సి వుంది. వివిధ పాలకపార్టీల వ్యూహాలకూ విశాల ప్రజాస్వామిక ప్రయోజనాలకు మధ్యన గల వ్యత్యాసాలను నిశితంగా గమనిస్తూ అడుగువేయవలసి ఉంటుంది.
తెలకపల్లి రవి