రూ.900 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం

Central Tribal University with Rs.900 crores– మేడారం పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రూ.900 కోట్లతో సమ్మక్క, సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారానికి విచ్చేసిన మంత్రి వీర వనితలకు పూజలు చేశారు. తులాభారంలో తూగి నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నట్టు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలన్నారు. మేడారంలో అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ ఏడాది నుండే ప్రవేశాలు ప్రారంభిస్తామని, ఎన్నికల అనంతరం శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ఏజెన్సీల గుర్తింపు జరిగిందని, 337 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశారన్నారు. అత్యధిక సీట్లు స్థానిక గిరిజన బిడ్డలకే ఇవ్వడం జరుగుతుందని, తాత్కాలిక సిబ్బందిని త్వరలోనే నియమించనున్నట్టు తెలిపారు. జాకారం యూత్‌ ట్రైనింగ్‌ ఇన్సిట్యూట్‌లో తాత్కాలికంగా ప్రారంభిస్తామన్నారు. ఇక్కడి సెంట్రల్‌ యూనివర్సిటీని నిర్వహించడానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సలహాదారుగా వ్యవహరిస్తుందన్నారు. అంతకుముందు హెలికాప్టర్‌లో వచ్చిన మంత్రి కిషన్‌రెడ్డికి హెలిప్యాడ్‌లో మంత్రి సీతక్క, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ పూలగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. మంత్రి కిషన్‌రెడ్డి వెంట హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, డా|| పి. విజరుచందర్‌రెడ్డి తదితరులున్నారు.