– నేడు హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు : జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు, రైతులు, కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని పంటలకు మద్దతు దర వ్యవసాయ ఖర్చుకు 50శాతం అదనంగా జోడించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణ మాఫీ చట్టాన్ని తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్‌ల వల్ల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఎనిమిది గంటల పని దినం, ట్రేడ్ యూనియన్ హక్కు వంటి హామీలను రద్దు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ దేశ వ్యాప్తంగా ఎస్‌కేఎం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర స్థాయి సదస్సును జరుపుతున్నట్టు వారు పేర్కొన్నారు.