స్త్రీల పట్ల తెలుగు శతకాల చూపు!

Telugu centuries view of women!ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియల్లో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియల ననుసరించి తెలుగు శతక రచన ప్రారంభమై, కాలక్రమేణా విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందింది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లి స్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు చెందింది. భారతీయ భాషల్లో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యం పొందలేదు. నేటికీ ఏ మూలనో ఒక చోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతి వలె అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే.

శతక పద్యాల్లో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించినవి ఉంటాయి. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని పద్యాల్లో కనపరిచేవారు శతకకారులు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వీరు కలం ఝళిపించేవారు. ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేట్టు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తమను ఒకనిగా భావించుకుని నీతి ఉపదేశం చేయటం ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేట్టు చేసే శైలిని ప్రదర్శించే వారు.
కానీ దురదష్టవశాత్తు శతకాల్లో స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవమైన స్థానాన్ని ఇవ్వలేదు. మహిళల హక్కుల గురించి గాని, వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి గానీ, వారు గురువుతున్న వివక్షత గురించి గానీ శతకాల్లో ఎక్కడా వివరించినట్టు మనకు కనపడదు. దానికి కారణం బహుశా శతకకారులు ఎక్కువ మంది పురుషులు అవ్వటం, వారు రచించిన కాలంలో సమాజంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉండటం. శతకకారులు కూడా సామాన్య ప్రజానీకం వలే, పితృస్వామ్య వ్యవస్థ వైపు మొగ్గుచూపుతూ స్త్రీల పట్ల చిన్న చూపు కలిగి ఉండటం ఇంకొక కారణం.
మొదటగా మనం, వేమన శతకంలోని పద్యాలను పరిశీలించినట్లయితే మహిళల వ్యక్తిత్వాన్ని ఎంతో చులకనగా ఆయన చిత్రీకరించాడని చెప్పక తప్పదు. భార్య సంపద ఉన్నప్పుడు మాత్రమే భర్తను గౌరవిస్తుందని, భార్యను అదుపులో పెట్టుకోలేకపోతే గౌరవం ఇవ్వదని, మహిళలు మగవారికి ఎదురు చెప్పకూడదని, భర్త ఎంత చెడ్డ వాడైనా కూడా అతనిని సేవిస్తూ ఉండాలనే అభిప్రాయాన్ని తన పద్యాల్లో కనపరిచాడు. ఆధునిక భావజాలం కల వేమన మహిళల పట్ల ఇటువంటి ఆలోచనలు కనపరచడం కొంతవరకూ దురదష్టకరం. వేమన మొదట స్త్రీలోలుడు. వేశ్యా వాటికల చుట్టూ తిరిగినట్టు చరిత్ర చెబుతోంది. వేమన రాజకీయాలు పట్టించుకోక ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు. వేమన వదిన నరసాంబ రాణి. ఆ వేశ్య.. రాణి ఆభరణాలు ధరించి అద్దంలో చూసుకోవాలని కోరుతుంది. మాతృప్రేమ గల నరసాంబ రాణి బులాకి తప్ప మిగతా అభరణాలు యిచ్చింది. వేశ్య బులాకీ కూడా కావాలని పట్టుబట్టింది. చీకట్లోనూ దీపంలాగే వెలిగే బులాకీని, ఆభరణాలు అన్నీ వేసుకున్న తర్వాత వేశ్య నగ్నదేహం చూడమనే షరతుతో ఇస్తుంది. అలా చూసిన వేమనకు మగువంటే విరక్తి కలిగి రోతపుట్టి, కోటకు వెళ్లి పడుకుంటాడు. బహుశా అటువంటి వారి సాంగత్యం వల్లే మహిళల పట్ల ఇటువంటి అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు.
ఆలి తొలుత వంచ కధముడైతా వెనుక
వెనుక వంతు ననుట వెర్రితనము
చెట్టు ముదరనిచ్చి చిదిమితే బోవునా
విశ్వదాభిరామ వినుర వేమ
”భార్యను తొలిగానే అదుపులో పెట్టుకోవాలి. తర్వాత అదుపులో పెట్టుకోవచ్చులే అనుకొనుట వెర్రితనం. చెట్టు పెద్దదైన తర్వాత సులభంగా పీకలేం”
కలిమినాడు మగని కామముగాజూచును
లేమిజిక్కునాడు, లేవకుండు
మగువ మగనినైన మడియంగ జూచును
విశ్వదాభిరామ వినుర వేమ
”సంపద వున్నప్పుడు భార్య భర్తను ప్రేమతో చూస్తుంది. పేదరికంలో మంచంపై నుండి లేవకుండా ఇటువంటి భర్త చనిపోయినా బాగుండుననుకుంటుంది”
పై పద్యాల వంటివి స్త్రీలను చులకనగా చూపుతూ, పితస్వామ్యాన్ని సమర్ధిస్తూ చెప్పటం వేమన ప్రగతిశీల వ్యక్తిత్వానికి మచ్చగా మిగిలిపోతుంది.
ఇప్పటి ”సామాజి సహ” పరంగా ఉన్న అవగాహనతో చూస్తే కొన్ని పద్యాల్లో కనిపించే ఆనాటి దృష్టి అసంబద్ధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీల పట్ల, కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు దురాచారాలుగా అనిపిస్తాయి. ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బందీలే అని మనం గ్రహించాలి.
క్రీ.శ. 1220-1280 మధ్య కాలంలో బద్దెన లేదా భద్ర భూపాలుడు రచించిన సుమతీ శతకంలో మహిళల పట్ల ఇటువంటి అభిప్రాయాలే కనపడతాయి. ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో ఒక చోళ సామంత రాజు. బహుశా ఒక మహిళ రాజ్యమేలటం ఇష్టపడక పోవడం లేదా ఒక మహారాణి కింద సామంతురాజులా కొనసాగటానికి అభిజాత్యం అడ్డు కావడమో కానీ, మహిళల పట్ల ఇటువంటి అభిప్రాయలు వ్యక్తం చేసి ఉండవచ్చు. మహిళల నోళ్లలో నిజాలు దాగవని ప్రజలకు విశ్వాసం ఉండదని, భార్యలు కేవలం సంపాదన ఉన్న భర్తలకే గౌరవిస్తారని, స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకూడదని అభిప్రాయాలను కవి తన పద్యాల్లో వ్యక్తం చేశాడు.
అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్‌
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
అల్లుని మంచితనము, గొల్లవాని పాండిత్య జ్ఞానమును, ఆడదాని యందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులు లోకములో నుండవు.
కోమలి విశ్వాసంబున
బాములతోఁజెలిమి యన్య భామలవలపున్‌
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ!
స్త్రీల నమ్మకమును, పాముల స్నేహమును, పరస్త్రీల మోహమును, వేపచెట్ల తియ్య దనమును, రాజుల విశ్వాసమును నమ్మరాదు. అవి అసత్యములుగా నిర్ణయించి జీవనము చేయాలి అని భావం.
గడనగల మననిఁజూచిన
నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.
ఇదే వరుసలో మర్రి వెంకయ్య రచించిన భాస్కర శతకం, పక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమార శతకాలు కూడా వస్తాయి. వీరు కూడా మహిళల వ్యక్తిత్వాలను పురాణాల ఆధారంగా ఎప్పటివో పాత కథల ఆధారంగా చిత్రీకరించారు తప్ప కాలానుగుణంగా వస్తున్న మార్పులను వీరి పద్యాలలో కనపరచ లేకపోయారు.
అంగన నమ్మరాదు తనయంకెకురాని మహాబలాడ్యువే
భంగుల మాయలొడ్డి చెఱపందల పెట్టు, వివేకియైన
సారంగధరుం బదంబుఁగరంబులు గోయఁగజేసెఁదొల్లిచి
త్రాంగియనేకముల్‌ నుడవరాని కుయుక్తులు పన్ని భాస్కరా!
స్త్రీ వ్యామోహముచే పురుషుని కోరగా అతడు నిరాకరించినచో వానికి అనేక నిందారోపణములు చేసి, రాజులచే కఠిన శిక్ష విధించు వరకు తన పన్నాగము వదలదు. పూర్వము చిత్రాంగియను స్త్రీ సారంగధరుని ప్రేమించగా, అతడు నిరాకరణ తెలుపగా రాజు వద్దకు వెళ్ళి అనేక ఫిర్యాదులు చేసి అతని కాళ్ళు, చేతులు నరికించినది కదా! అందుకే అలాంటి స్త్రీలను నమ్మరాదు. బలవంతుడైననూ బాధలకు గురియగును.
ఋణ మధిక మొనర్చి సమర్పణ
చేసిన తండ్రి విద్యరాని కొడుకు
లక్షణశాలి రాణి దుశ్చారిణియగు
జననియును దల్ప రిపులు కుమారా!
ఓ కుమారా! కుమారులకు అప్పులను ఆస్తులుగా ఇచ్చిన తండ్రి, విద్యలేని కుమారుడు, అందమైన భార్య, చెడునడత గల్గిన తల్లి ఆలోచించినచో వీరందరూ శత్రువులే సుమా!
సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యం పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. శతక రచనల్లో కవికి బోలెడంత స్వేచ్ఛ ఉంది. చదివేవాడికి కూడా రోజుల తరబడి ఒకే గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన పని బడదు. కనుక ఒక్క పద్యంతోనే కవికీ, చదువరికీ అనుబంధం ఏర్పడవచ్చును. శతకాలు క్లుప్తంగా విషయాన్ని విడమరచి చెప్పే సాధనాలు. అందుకే ఇవి ప్రజా కవిత్వముగా ఆదరణ సంతరించుకొని ఉండవచ్చును. ఇంతటి ప్రాచుర్యం గల శతకాల్లో స్త్రీని తక్కువగా చూపి వర్ణించుట, వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎంతైనా ఆక్షేపణీయం.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న నేటి ఆధునిక యుగంలో మహిళలను కించ పరిచే భావనలు వచ్చే పద్యాలను నేటి తరానికి అందుబాటులో లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. లేదా కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా శతకాల్లోని పద్యాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది.

– ఈ. శ్రీనివాస రెడ్డి