”తెలంగాణలో కాంగ్రెస్‌ పాపాల శతకం”

''తెలంగాణలో కాంగ్రెస్‌ పాపాల శతకం''– ”స్కాంగ్రెస్‌” పుస్తకాల ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”తెలంగాణలో కాంగ్రెస్‌ పాపాల శతకం”, ”స్కాంగ్రెస్‌” పుస్తకాలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవిష్కరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం రూపొందించిన ఈ పుస్తకాలను మంగళవారం తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాపాలకు ఈ ఎన్నికల్లో ప్రజలే శిక్ష వేస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ పాపాల చిట్టాను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని తెలిపారు. వీటిని రూపొందించిన సోషల్‌ మీడియాను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్లు వై.సతీష్‌ రెడ్డి, జగన్‌ మోహన్‌ రావు, దినేష్‌ చౌదరి,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి నాలుగు నియోజకవర్గాలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌ లో చేరారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్య క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కె.తారక రామారావు గులాబీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పాలకుర్తి కాంగ్రెస్‌ నేత తిరుపతి రెడ్డి ,గద్వాల నేత కురువ విజరు కుమార్‌ ,ముధోల్‌ కాంగ్రెస్‌ నేత కిరణ్‌ వాగ్మోరేతో పాటు జనగామ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఇవ్వాళ ఎమ్మెల్యే టికెట్లు అమ్ము కుంటున్న రేవంత్‌ రెడ్డి పొరపాటున సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్ము కుంటారని విమర్శించారు. ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రే షన్‌ అనీ, బీఆర్‌ఎస్‌ దాన్ని ఇరిగేషన్‌గా మార్చి ందని తెలిపారు.
15 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, అమిత్‌ షా, ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సింహంలాగా సింగిల్‌గా వస్తారని తెలిపారు.
సమన్వయకర్తల నియామకం
పలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారక రామారావు నియమించారు. షేక్‌ అబ్దుల్లా సోహైల్‌ (జీహెచ్‌ఎంసీ), రాపోలు ఆనంద భాస్కర్‌ (మునుగోడు), పద్మావతి డీపీ రెడ్డి (అంబర్‌ పేట )లు నియమితులైన వారిలో ఉన్నారు.