సమాచారానికి సంకెళ్లు

Chains of information– పబ్లిక్‌ డొమైన్‌లో అర్ధ సత్యాలు, అసత్యాలు
– తెలంగాణ సమాచార కమిషన్‌ ఖాళీ
– ఏడాదిగా భర్తీ కాని పోస్టులు
– కోర్టు ఆదేశించినా… నిరాశే
– కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టి పెట్టాలని వినతుల వెల్లువ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమాచారానికి గత ప్రభుత్వం సంకెళ్లు వేసింది. పబ్లిక్‌ డొమైన్‌లో అర్థ సత్యాలను, అసత్యాలను మాత్రమే ఉంచింది. కింది స్థాయి నుంచి మొదలుకొని ఉన్నతాధికారి వరకు ఏ కార్యాలయానికెల్లి సమాచారమడిగినా మాకేం తెలియదంటూ తప్పించుకొని తిరిగారు. ఆర్టీఐ యాక్ట్‌ 2005 ప్రకారం సమాచారం ఇప్పించాలని స్టేట్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌(ఎస్‌ఐఓ)కు వెళ్లిన వారికి అక్కడా మొండి చేయే ఎదురైంది. ఫిబ్రవరి 2023 నుంచి ముఖ్య సమాచార కమిషనర్‌తో పాటు ఆరుగురు కమిషనర్లను ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఫలితంగా పెండింగ్‌ కేసుల సంఖ్య 12 వేలకు పెరిగింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాచార కమిషన్‌పై దృష్టి సారించాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి.
దేశభద్రత, రక్షణకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం తప్ప ప్రభుత్వానికి చెందిన సమాచారమంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీనిపై అనధికారికంగా నిషేధం విధించింది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని వాటి సైట్లలో అరకొర మాత్రమే ఉంచి చేతులు దులుపుకుంది. కీలక మైన జీవోలు, ఒప్పందాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచలేదు, అడిగినా అధికారులు ఇవ్వలేదు. సంబంధిత ఉద్యోగులనడిగితే హెచ్‌వొడీనడగమనీ, హెచ్‌వోడినడిగితే తమ శాఖాధిపతినడగమనీ, చివరికి పంచాయితీ అక్కడికెలితే నేరుగా ఇవ్వడం కుదరదు, ఆర్టీఐ ద్వారా తీసుకోమని చెప్పడం తంతుగా మారి పోయింది. పదేండ్లలో ఏ ఒక్క ప్రభుత్వ అధికారూనా సమాచారం ఇచ్చిన దాఖలాలు దాదాపు లేవు. సర్కార్‌ ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారి పోయి చాలా మంది తమకు కావాల్సిన సమాచారం కోసం స్టేట్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌ వెళ్లారు. అక్కడా వారికి నిరాశే ఎదురైంది. సమాచారాన్ని ప్రజలకు అందుబాలో ఉంచకూడదన్నదేమోగానీ ప్రభుత్వం గత సమాచార కమిషన్ను నిర్వీర్యం చేసింది. నిధులు కేటాయించ పోవడం, కమిషనర్లను భర్తీ చేయక పోవడం లాంటి చర్యలతో శాఖ పట్ల ప్రజలకు విసుగొచ్చే చర్యలకు పాల్పడింది. సమాచార కమిషన్‌లో స్టేట్‌ చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌తో పాటు ఆరుగురు కమిషనర్లు ఉంటారు. గత ఫిబ్రవరి నుంచి ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కోర్టు తలుపు తట్టినా రేపూ, మాపూ అంటూ తప్పించుకుంది. కోర్టు మొట్టి కాయలు వేయడంతో గతేడాది ఆగస్టు 4న సమాచార కమిష్‌నర్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయగా 285 మంది ధరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, మరో క్యాబినెట్‌ మంత్రితో కూడిన కమిటీ కమిషన్‌ను నియమిస్తుంది. అప్పటి సీఎం కేసీఆర్‌ భర్తీకి సంబంధించి చొరవ తీసుకోక పోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ లోపు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కేసీఆర్‌ స్థానంలో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టింది. కొత్త సర్కార్‌ సమాచార కమిషన్‌కు కమిషనర్లను నియమించి గాడిన పెట్టాలని పలువురు కోరుతున్నారు.
12 వేల కేసులు పెండింగ్‌
తెలంగాణ సమచార కమిషన్‌లో 2017 నుంచి 12 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో నాలుగు వేలు ఫిర్యాదులు కాగా, ఎనిమిది వేల అప్పిళ్లున్నాయి. పలు కేసుల్లో ఆర్డర్లిచ్చినా అధికారులు వాటిని అమలు చేయకపోవడంతో ఫిర్యాదుదారులు తిరిగి ఆర్టీఐ కమిషన్‌ తలుపుతడుతున్నారు. ఆరేండ్లుగా వాయిదాలు పడుతున్నాయే తప్ప ఓ పట్టాన తెగడం లేదు. ఏడాదిగా కమిషనర్లు లేక పోవడం, సమాచారం ఇవ్వాల్సిన శాఖలు కుంటి సాకులు చెప్పడం తదితర కారణాలు వెరసి కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కొన్ని విభాగాలకు చెందిన వారు కమిషన్‌ విధించిన అపరాధ రుసుం చెల్లిస్తున్నారే తప్ప సమాచారం ఇవ్వడం లేదు. దాంతో బాధితులు కోర్టు మెట్లెక్కుతున్నారు.
పదేండ్లలో సమాచార వ్యవస్థ విధ్వంసమైంది
పద్మనాభ రెడ్డి, ఫొరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌
పదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సమాచార వ్యవస్థ నిర్వీర్యమైంది. ప్రభుత్వంలోని ఏ శాఖకూడా ప్రజలడిగిన సమాచారం ఇవ్వలేదు. అధికారులు సమాచారం ఇవ్వకపోవడం… సమస్యను పరిష్కరించాల్సిన కమిషన్‌ చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. కమిషనర్ల నియామకానికి సంబంధించి అప్పటి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు చాలా సార్లు ప్రయత్నించినా కుదురకపోవడంతో కోర్టు తలుపు తట్టాం. కోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్‌ ఇచ్చినా భర్తీని ఆలస్యం చేసింది. ఈ లోపు ప్రభుత్వం మారడంతో ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి కమిషనర్లను నియమించాలని కోరాం. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి త్వరలోనే కమిషన్‌లోని ఖాళీలన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.