వేములవాడ డివిజన్ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ (ఎం) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం వేములవాడలోనీ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. ఐలమ్మ పేరు వినగానే మన అందరికీ ఉద్యమస్ఫూర్తి గుర్తుకు వచ్చే గొప్ప విషయం , తాను ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వీరవనిత అని కొనియాడారు. భూ పోరాటానికి నాంది పలికిన వీరనారి, ఆధునిక సామాజిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి అని అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వీరనారి అని కొనియాడారు. తన కుటుంబం ఆర్ధికంగా వెనుకబడి ఉండడంతో చాలా కష్టాలు అనుభవించిన 1940 నుండి 1944 మధ్య కాలంలో రజాకార్ల అరాచకంపై వ్యతిరేకంగా పోరాడి ఎర్ర జెండా పట్టిన వీర వనిత అని అన్నారు.భూమి నాది.. పండించిన పంట నాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. అంటూ తన మాటలను తూటాలుగా మార్చి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని అన్నారు. పోరాట వరసత్వాన్ని నేటితరం యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని కొనసాగించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ముక్తికాంతా అశోక్, మల్లారపు ప్రశాంత్ , నాయకులు చిలుక బాబు, అశోక్, పర్శరాం తదితరులు పాల్గొన్నారు.