చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

– రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చి న పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ శివాజీ చౌక్‌ వద్ద లక్ష్మిగుడా రజక సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ 128వ జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రప టానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి దిశా నిర్దేశం కల్పించి సాయుధ పోరాటాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. ప్రతి సంవత్సరం చాకలి ఐలమ్మ జయంతి, వర్థంతులను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఐదవ తరగతి తెలుగు వాచకంలో ఐలమ్మ పాఠం పొందుపరచడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గుడా రజక సంఘం పాలకవర్గం సభ్యులు బాలయ్య, రాములు, వేణుగోపాల్‌, మహేందర్‌, మహేష్‌, మల్లేష్‌, సురేష్‌, రాజు, మల్లేష్‌, రమేష్‌, విష్ణు, జంగయ్య, సాయి, అనిల్‌, రాఘవేందర్‌, వెంకటేష్‌, జగదీష్‌, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ అధ్యకుడు ప్రేమ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి గుమ్మడి కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.