తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలానికి చెందిన గ్రామం మాచన్‌పల్లి. హైదరాబాద్ నగరానికి 47కి.మీ.ల దూరంలో వుంది. బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాలు పురామానవుల ఆవాసాలైన గుహలకు, పరుపుబండలకు, వారి సంస్కృతిని ప్రతిబింబించే రాతిచిత్రాలు, చెక్కుడుబొమ్మలు, గీకుడుబొమ్మలు, రాతిబొద్దులు, పనిముట్ల నూరుడుగుంటలు, బంతిరాళ్ళ సమాధులు, మైక్రోలిథ్స్, రాతిగొడ్డండ్లవంటి రాతిపరికరాలకు ప్రసిద్ధం. ఇక్కడున్న ఎత్తు తక్కువున్న గుట్టలమీద, పరుపు బండలమీద పురామానవుల నాగరికతకు సంబంధించిన ఏదో ఒక విశేషం వెలుగుచూస్తూనే వున్నాయి. ఇటీవల మూడుచింతలపల్లిలో తెలంగాణాలో ప్రథమంగా కంకణవత్తం జియోగ్లైఫ్ గుర్తించబడ్డది. బొమ్మల రామారం మండలానికి చెందిన మాచన్‌పల్లి రామునిగుట్టమీద రామాలయం, శివాలయాలకు తూర్పున సహజనీటిగుండం ఒడ్డున గీయబడిన ‘లాబ్రింత్’ను కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు మహమ్మద్ నసీర్, అన్వర్, అహోబిలం కరుణాకర్, కొరివి గోపాల్ లు గుర్తించిన సమాచారంతో చరిత్రబృందం కన్వీనర్, కో కన్వీనర్లు శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్, జమ్మనపల్లి రమేశ్ లు లాబ్రింత్ ఉన్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ లాబ్రింతుల కాలం విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు జియోగ్రాఫిస్టులు 8వేల సం.రాల కిందటివని, మరికొందరు కాంస్య(చాల్కోలిథిక్)యుగం నాటివని అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో ఈ లాబ్రింతులను 17వ శతాబ్దం నుంచి తాంత్రిక గ్రంథాలలో చక్రవ్యూహాలుగా పేర్కొన్నారు. హళేబీడు దేవాలయం గోడలపై మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పాల్గొన్న ‘పద్మవ్యూహం’ చెక్కబడింది. చక్రవ్యూహం లేదా పద్మవ్యూహంగా పిలిచే పౌరాణిక యుద్ధవ్యూహాన్ని పోలిన ఈ పెట్రోగ్లైఫ్ ప్రపంచమంతటా చిన్నా, పెద్ద సైజులలో కనిపిస్తున్నాయి. ఏడు వలయాల ఈ రాతిచెక్కుడుబొమ్మలో ఒకే ప్రవేశద్వారం ఉంది. ఒక అడుగు వైశాల్యంతో కనిపించే ఈ లాబ్రింత్ చిత్రణలో మనదేశంలోని కొంకణతీరం ఉస్గలిమోల్, మహారాష్ట్ర గోల్కామాన్ లలోని ఏ పెద్ద లాబ్రింత్ కు తీసిపోని విధంగా ఖచ్చితమైన గీతలలో కనిపించింది. ఈ లాబ్రింత్ లు మానవసాంస్కృతిక విశ్వాసాలకు సంబంధించిన మిస్టిక్ చిత్రం. జీవన ప్రవేశం సులువే కాని జీవన గమ్యం చేరడమే గహనం(కష్టం) అనే భావనాత్మకమైనది ఈ లాబ్రింత్. చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి లాబ్రింతు వంటి పెట్రోగ్లైఫ్ ప్రాక్చరిత్రపరిశోధనకు మరింత ఆధారం లభించినట్లైందని అన్నారు. ఈ లాబ్రింతును గుర్తించడం తెలంగాణాలో ఇదే మొదటిసారి అని చరిత్రబృందం సభ్యులు పేర్కొన్నారు. లాబ్రింతు చెక్కబడిన పరిసరాల్లో రాతిబొద్దులు, కొత్తరాతియుగపు నూరుడుగుంటలు, కొత్త పెట్రోగ్లైఫ్స్ ను కూడా చరిత్రబృందం గుర్తించింది. క్షేత్ర పరిశోధన: ఎండి. నసీర్, అన్వర్, అహోబిలం కరుణాకర్, కొరివి గోపాల్, శ్రీరామోజు హరగోపాల్, బీవీ భద్రగిరీశ్, జమ్మల రమేశ్ కొత్త తెలంగాణ చరిత్ర బృందం.