మండలంలోని నర్సాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.సోమవారం గ్రామంలోని బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మాజీ సర్పంచ్ పెండే ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎండలు అధికమైనందున ప్రయాణికుల, ప్రజల దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సేవా దృక్పథంతో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహ సేవా సమితి సభ్యులను ఆయన అభినందించారు. గ్రామంలోని యువత సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని ఇతర యువజన సంఘాల సభ్యులు కూడా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నార. రాబోయే రోజుల్లో గ్రామంలో సేవా సమితి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహ సేవా సమితి సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవా సమితి సభ్యులు రతన్, మల్లెల ప్రశాంత్, జాగిర్యాల రాజేష్, సృజన్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.