విద్య వ్యక్తిని సమాజానికి ఉపయోగించే వాడిగా తీర్చిదిద్దుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణ మూర్తిమత్వ నిర్మాణంలో, మానవ వనరుల రూపకల్పనలో విద్య పాత్ర ప్రధానం. అందుకే ప్రపంచంలోని అన్ని సమాజాలు తమకు కావాల్సిన విద్య రూపకల్పనకు పూనుకుంటున్నాయి. విద్యకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. స్వాతంత్రోద్యమ కాలం నుంచి దేశంలో విద్యా విధానం గురించి, అందరికీ విద్య గురించి చర్చలు జరిగాయి. స్వాతంత్రా నంతరం కూడా అనేక కమిషన్లు ఏర్పాటు చేసి దేశంలో విద్యా విధానం గురించి అనేక సిఫార్సులు కూడా చేశాయి. రాజీవ్‌గాంధీ కాలంలో1986లో జాతీయ విద్యా విధానం వచ్చింది.
రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం మెజారిటీగా ప్రయివేటు రంగం ఆధీనంలో ఉంది. పది విశ్వవిద్యా లయాలు ప్రయివేటు రంగంలో ప్రారంభమ య్యాయి. వృత్తి విద్యా కోర్సులలో ప్రయివేటు సంస్థల ప్రాబల్యం పెరిగి పోయింది. ఇంటర్మీడియట్ విద్య వేళ్ళ మీద లెక్కబెట్టగలిగిన మూడు, నాలుగు సంస్థల చేతుల్లో బందీ అయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు కూడా వివక్షకు గురై పూర్తిస్థాయిలో అన్ని శాఖలతో అభివృద్ధి జరగలేదు. సమాజ అవసరాలు తీర్చగల నైపుణ్యత గల మానవ వనరులను తీర్చిదిద్దడం విశ్వవిద్యాలయాల కర్తవ్యం. కానీ రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలన్నీ అధ్యాపకుల కొరత, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పూర్తిస్థాయిలో అధ్యాపకుల నియామ కాలు లేవు . వైస్ ఛాన్సలర్‌లు లేరు. వైస్ ఛాన్స్‌లర్ల ఎంపికలో విద్యావేత్తలను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రభుత్వ అధినేతలకు వీర విధేయత ప్రాతిపదికన ఎంపిక జరగరాదు. లేనిచో సంక్షోభంలో ఉన్న విద్యావ్యవస్థను రక్షించలేము. చివరికి వైస్ ఛాన్స్‌లర్లు కూడా లేనటువంటి విశ్వవిద్యాలయాల ద్వారా ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను ఆశించలేము.
విద్యా కమిషన్ బాధ్యత
సాంప్రదాయ డిగ్రీ కోర్సులు, హ్యుమానిటీ సబ్జెక్టులన్నీ నిరాదరణకు గురవుతున్న నేపథ్యంలో విద్యా కమిషన్ అన్ని కోర్సుల సమతుల్యతకు, అభివృద్ధికి సిఫార్సులు చేయాల్సి ఉంది. స్థానిక సహజ వనరులతో ఆయా జిల్లాలను స్వయం పోషకంగా రూపొందించే సరికొత్త ఆవిష్కరణలు జరిగే పరిశోధన కేంద్రాలుగా, విజ్ఞాన కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు రూపొందేలా చూడా ల్సిన అవసరం ఉంది. సాంప్రదాయ సైన్స్ సబ్జెక్టుల ద్వారానే విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు, హ్యుమానిటీస్ సబ్జెక్టుల ద్వారా సామాజిక పరిశోధనలు జరిగి సమాజాభివృద్ధికి తోడ్పడు తాయి. శాస్త్ర సాంకేతిక రంగాలతో సహా వృత్తి విద్యా కోర్సులు ఆర్థిక అభివృద్ధిలో తోడ్పడుతాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఐఐటీ లాంటి విద్యా సంస్థలు కేవలం సాంకేతిక కోర్సులకే పరిమితం కాకుండా, వాటి క్యాంపస్‌లలో మేనేజ్మెంట్, హ్యుమా నిటీస్, వైద్య విద్య, ఉపాధ్యాయ విద్య అందించే కోర్సులను ప్రవేశపెట్టి, క్యాంపస్‌లలోని విద్యార్థులకు ఇతర సబ్జెక్టులు చదివే వారితో సహజీవన అనుభవం కలిగించే సందర్భంలో కేవలం నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీ స్థాపించడాన్ని సమీక్షించాలి.
విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని నూతన విద్యా విధానం-2020 ప్రతిపాదించింది. విద్యాలయాలను శ్రేణులుగా వర్గీకరించి కార్యసరళిని బట్టి పరిశోధనా నిధులు కట్టబెట్టే ఆలోచన చేసింది. ఇది సామాజిక న్యాయానికి, సమాన అవకాశాలకు విఘాతం కలిగిస్తుంది. స్థాయి భేదాలు కూడా తీవ్రమవుతాయన యదార్థాన్ని అర్థం చేసుకోలేకపోయింది. నూతన విద్యావిధానంలోని ప్రతిపాదనలు విద్యను కార్పొరేట్‌పరం గావించేవిగా ఉన్నాయి. ఫలితంగా పేదలకు చదువులు దూరం చేసేందుకు దోహదపడతాయనిలో సందేహం లేదు. నాణ్యత లేకపోవడం, ఉపాధికి ఉపయోగపడకపోవడం మన ఉన్నతవిద్యలో ఉన్న పెద్ద బలహీనత.ఉద్యోగాలకు వెళ్లే గ్రాడ్యుయేట్లలో సగం మందికి ఇంటర్వ్యూలో పాల్గొనే మెళకువలు కూడా ఉండటం లేదని ”ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2023” వెల్లడించింది. దేశంలో విద్యా నాణ్యత దిగజారు తోందని యూనిసెఫ్ తాజా నివేదిక తెలుపుతోంది. ప్రాథమికవిద్యలో కొంత పురోగతి సాధించినప్పటికీ సెకండరీ స్థాయి విద్యను పూర్తిచేసే రేటు ఆందోళన కలిగిస్తుందని కూడా తెలిపింది. ఇంటర్ స్థాయి విద్యను పూర్తి చేసిన వారి రేటు కూడా కేవలం 51శాతంగానే ఉన్నది.ఇవన్నీ కమిషన్ మెరుగు పరుస్తుందా?
సమాజ అవసరాలకు అనుగుణంగా ఉండాలి
సాంకేతిక విద్య అంటే ఇంజనీరింగ్ డిగ్రీలని, ఉద్యోగం అంటే ఐటీ ఉద్యోగమనే భావన పెరిగిపోయింది. ఇంజనీరింగ్ విద్యాసంస్థలు మెజార్టీగా ప్రయివేటురంగంలోనే ఉండటంతో ఉన్నత వర్గాల , ధనిక వర్గాలకు మాత్రమే అందుబాటులోకి రావడంతో పేదవారికి ఇంజనీరింగ్ విద్య ”అందని ద్రాక్ష ” అయింది. ప్రభుత్వరంగంలో చాలినన్ని విద్యాసంస్థలు లేకపోవడంతో పేద విద్యార్థులు ఇంజనీరింగ్, సాంకేతిక విద్య అందుబాటులో లేకుండా పోయింది. ఐటీ విద్యనే సాంకేతిక విద్య అనే అనారోగ్య ప్రచారంతో, ప్రభుత్వ విద్యా సంస్థలు మారుతున్న సాంకేతిక నైపుణ్యాలను అందజేసే కోర్సులను ప్రవేశపెట్టే విషయంలో వెనుకబడిపోవడం ఒక కారణం. పేద విద్యార్థులకు అన్ని రకాల కోర్సులను అందుబాటులోకి వచ్చే విధంగా కళాశాలలను ఆధునీకరించి, ప్రభుత్వ రంగంలో చాలినన్ని విద్యాసంస్థలను స్థాపించి అభివృద్ధి చేయాలి. ఐటీ ఉద్యోగాలు కూడా కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు చౌక కూలీలను అందజేసే సంస్థలుగా మారకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే పరిశోధక కేంద్రాలుగా సాంకేతిక విద్యాసంస్థలు అభివృద్ధి కావాలి. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన సమాజ అవసరాల కనుగుణంగా రూపొందేలా ఉండాలి. అందుకు తగిన నిధులు కేటాయించి, పరిశోధనలు జరగాలి.
జిల్లా కొక్క వైద్య కళాశాల పేరుతో 27 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి. అందులో సరిపడా అధ్యాపకుల నియామకాలు లేకపోవడంతో యేటా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులివ్వడం లేదు. అటువంటి పరిస్థితులను రాకుండా చూడాలి. ప్రయివేటు రంగం లోని 28 వైద్య కళాశాలలో కూడా ప్రమాణాలతో కూడిన వైద్య విద్యను అందించే చర్యలు తీసుకోవాలి. తాజాగా డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో మెడికల్ కాలేజీల నిర్వహణ వల్ల పేద, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లతో లభించే సీట్లు, కన్వీనర్ కోటా, రిజర్వేషన్ కోటా వల్ల సీట్లు తగ్గిపోయి మెరిట్‌తో పాటు పేద విద్యార్థులకు అన్యాయం జరుగనుంది.
రాష్ట్రంలో విద్యారంగానికి నిధుల కేటాయింపు 7.31శాతంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు కేటాయించిన బడ్జెట్ 11 శాతంగా ఉండేది. డాక్టర్ కొఠారి రాష్ట్ర బడ్జెట్‌లో 30శాతం నిధులు కేటాయించాలని సూచించారు. ఢిల్లీ 25శాతం, కేరళ 20శాతం బడ్జెట్ కేటాయిస్తోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం పై రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని విద్యారంగానికి కేటాయించే నిధులను పెంచాలి. పెట్టుబడి తప్ప తక్షణ ఆర్థిక రాబడి లేని రంగంగా విద్యావ్యవస్థను చిన్నచూపు చూసే విధానం మారాలి. నిధుల లభ్యతతోనే పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయుల నిరంతర నియామకాల కోసం యేటా డీఎస్సీ నిర్వహించడం, కొత్త పాఠశాలలను స్థాపించడం చేయవచ్చు. నిధుల లభ్యతతోనే విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తూ పరిశోధనలను ప్రోత్సహిస్తూ, యువతను అన్ని రకాల నైపుణ్యత గల సృజన శీలురుగా తయారు చేసుకోవచ్చు. తద్వారానే దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది. నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ వంటి దేశాలు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని, మేలిమి విద్యను అందిస్తున్నాయి. అద్భుతమైన విద్యకు పునాది వేసుకుంటున్నాయి.
కె. వేణుగోపాల్
9866514577