ఎన్నికల నేపథ్యంలో ఆర్‌అండ్‌బీకి సవాళ్లు పెరుగుతున్న పని ఒత్తిడి

– నెలరోజుల్లో నిమ్స్‌కు టెండర్లు
– కలెక్టరేట్లు, క్యాంపు ఆఫీసుల నిర్మాణంలో బిజీబిజీ
– షెడ్యూల్‌ వచ్చేలోగా పనులు పూర్తి చేసే యత్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
వచ్చే సాధారణ ఎన్నికలు రోడ్లు, భవనాల శాఖను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నాయి. గులాబీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆర్‌ అండ్‌ బీ అధికారులపై పనిఒత్తిడి తీవ్రంగా పెరుగుతున్నది. సెప్టెంబరులో దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రానుందనే ప్రచారం జరుగుతున్నది. రాజకీయ పార్టీలు సైతం ఆ మేరకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకునే పనిలో ఉండగా, ప్రతిపక్షాలు ప్రజాసమస్యలపై పోరాటపథంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. సమీక్షలు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితాలు, ఇతర అంశాలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో మాట్లాడుతున్న విషయం విధితమే. ఈనేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేసే ప్రయత్నాల్లో ఉంది. సీఎం కేసీఆర్‌తోపాటు ఆయా జిల్లాల్లోని పనులకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు అధికారులపై ఆయా పనులు పూర్తి చేయాలంటూ పదే పదే కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు పనులకు సంబంధించి శంకుస్థాపన లు చేసింది.అవి ఎన్నికల్లోపు పూర్తయ్యేలా చూడటం, మిగతావి పనులు జరుగుతున్నాయనే భావన ప్రజల్లో కలిగేలా చర్యలు తీసుకుంటూ ముందుకు పోతున్నది. ఐదు ఆస్పత్రులు, ఎనిమిది మెడికల్‌ కాలే జీలు, మూడు టీమ్స్‌తోపాటు వరంగల్‌ ఆస్పత్రులకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు రూ.2700 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. వరంగల్‌ దవాఖానాకు రూ. 1100 కోట్లు కేటాయించారు. అలాగే తాజాగా రెండు వారాల క్రితం నిమ్స్‌లో 2000 పడకలతో కొత్త బ్లాక్‌కు భూమిపూజ చేసిన విషయం విదితమే. దీనికి రూ.1575 కోట్లు ప్రతి పాదించారు. 25 కలెక్టరేట్లు పూర్తయ్యాయి. మరో నాలుగు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. సూర్యాపేట, మెదక్‌, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సెప్టెంబరులో కలెక్టరేట్లను పూర్తిచేసి ప్రజలకు పరిపాలనను అందుబాటులో తేనున్నారు. అలాగే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ఇప్పటికే 100 వరకు నిర్మించారు. మరికొన్ని ఉన్నాయి. నగరంలోని 15 నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణానికి స్థలాలు దొరకక ఇబ్బందులు ఎదురవు తున్నట్టు సమాచారం. ఇకపోతే పాతబస్తీలో మాకు క్యాంపు ఆఫీసులు అవసరం లేదని ఎంఐఎం ఎమ్మెల్యేలు చెబుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లో హెచ్‌వోడీల కోసం ట్విన్‌ టవర్స్‌ కడతామని ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లోగా ఆ ఆలోచన అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. కేసీఆర్‌ సర్కారు ఏర్పడిన మొదటి టర్మ్‌లో మిశ్రమాభివృద్ధి జరిగిందనీ, రెండో విడతతో మాత్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల జోరు పెరిగిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించి తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. అలాగే అంబేద్కర్‌ విగ్రహాం, అమరవీరుల స్థూపం ఇలా అనేక రకాల నిర్మాణాలను వేగంగా పూర్తిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నంలో ఉంది. ఆయా నిర్మాణాల్లో మెఘా, ఎల్‌అండ్‌టీ, కేపీసీ, షాపూర్జీ- పల్లోంజీ, డీఈసీ, తదితర సంస్థలు కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. భారీ ఆస్పత్రుల నిర్మాణం ద్వారా వైద్యసదుపాయాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నది. జులై 20వ తేదీ వరకు నిమ్స్‌ కొత్త బ్లాక్‌కు టెండర్లను ఆహ్వానించారు. భారీగా ప్రాజెక్టులు చేపడుతున్న తరుణంలో నిధులు సైతం విరివిగా అవసరమవు తాయి. అలాగే పాత బకాయిలు సైతం రూ. 1000 కోట్ల వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు పనుల ఒత్తిడి, మరో వైపు పాత బకాయిలు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు, వర్కింగ్‌ ఏజెన్సీల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని అంటున్న అధికారులు లేకపోలేదు.