15న చలో ఇందిరా పార్క్‌

Chalo Indira Park on 15th– ఆటో, క్యాబ్‌ మీటర్‌ చార్జీలను పెంచాలి పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
ఆటో, క్యాబ్‌ మీటర్‌ చార్జీలను ప్రభుత్వం పెంచకపోతే బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడిస్తామని తెలంగాణ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు బైరగోని రాజు గౌడ్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌ దేశోద్ధారక భవన్‌లో ఆదివారం తెలంగాణ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్స్‌ యూనియన్‌, తెలంగాణ సెక్యూర్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్‌ 15న చేపట్టనున్న చలో ఇందిరాపార్క్‌కు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగినా ఇప్పటివరకు ఆటో, క్యాబ్‌ మీటర్‌ చార్జీలు పెరగలేదని అన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వారి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని, లేకుంటే ఓటమి తప్పదని తెలిపారు. గ్రీన్‌ టాక్స్‌, క్యాటర్లి టాక్స్‌ పేరిట వసూలు చేయడం తక్షణమే ఆపాలని, 30 శాతం కమీషన్‌ నొక్కి డ్రైవర్లను లూటీ చేస్తున్న కార్పొరేట్‌ ఓలా, రాపిడో, ఉబర్‌ సంస్థలను తక్షణమే నిషేధించి, ప్రభుత్వమే ట్రావెలింగ్‌ యాప్‌ను ప్రవేశపెట్టాలని కోరారు. మినిమం కమీషన్‌తో డ్రైవర్లకు బుకింగ్‌ సౌకర్యం కల్పించాలని అయన విజ్ఞప్తి చేశారు. ప్రధాన కార్యదర్శి బొంగు రవి గౌడ్‌ మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా వెంటనే ఐటీ సెక్టార్‌ క్యాబ్‌ చార్జీలు పెంచాలన్నారు. అర్హత కలిగిన ప్రతీ డ్రైవర్‌కు సబ్సిడీ వాహనాలు అందించి ఇల్లులేని పేద డ్రైవర్లకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకొను సురేందర్‌ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మహేష్‌ ముదిరాజ్‌, వ్యవస్థాపక అధ్యక్షులు దుసారి రాజు గౌడ్‌, కోశాధికారి సిలివేరు నరసింహ, ప్రచార కమిటీ చైర్మెన్‌ పొడుగు శ్రీకాంత్‌, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెరుగు బిక్షం, కార్యవర్గ సభ్యులు కె.రమేష్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, కుమార్‌ యాదవ్‌, భారత్‌ ముదిరాజ్‌, అడ్విసెర్‌ డి.ఆర్‌. రాము తదితరులు పాల్గొన్నారు.