29న చలో ఇందిరాపార్కు

– మహాధర్నాను వీఓఏలు జయప్రదం చేయాలి
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఐకేపీ వీఓఏల పట్ల రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రకటించారు. దాన్ని ఐకేపీ వీఓఏలంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐకేపీ వీఓఏల సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కె. రాజ్‌కుమార్‌ అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగింది. అందులో భాస్కర్‌ మాట్లాడుతూ.. ఐకేపీ వీఓఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రూ.10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సెర్ఫ్‌ నుంచి ఐడీ కార్డులివ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. 40 రోజులు సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర సర్కారు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు మహాధర్నాకు పిలుపునిచ్చామని తెలిపారు. ఐకేపీ వీఓఏల యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎస్వీ. రమ మాట్లాడుతూ 19 ఏండ్ల నుంచి గ్రామాల్లో మహిళల అభ్యున్నతికి వీఓఏలు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న వీఓఏలు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని వివరించారు. తక్షణమే వీఓఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.