– కాంగ్రెస్ కుట్రలను ఎండగడతాం
– మూడు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టును కూల్చే కుట్ర చేస్తున్నారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన మూడు పిల్లర్లను చూపించి రాజకీయ లబ్ధి కోసం మొత్తం ప్రాజెక్ట్‌ను కూల్చేం దుకు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కడెం, గుండ్ల వాగు, మూసి, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయని గుర్తు చేశారు. కాపర్ డ్యాం నిర్మాణం చేసి కుంగిన మూడు పిల్లర్లకు మరమత్తులు చేయకుండా కాంగ్రెస్ రాజకియాలు చేస్తున్నారని విమర్శించారు. మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే చెప్పామని గుర్తు చేశారు. రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ముందు మరమ్మత్తులు చేపట్టి సాగు నీరందించాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో వచ్చే వరదతో కుంగిన మూడు బ్యారేజీలు కొట్టుకపోయేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్ట్‌పై ఆ పార్టీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 1న తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో కూడిన బృందం తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డను సందర్శించేందుకు వెళుతుందని చెప్పారు. కాగ్ రిపోర్టును అడ్డంపెట్టుకుని ఏదో సాధించాలని చూస్తున్నారనీ, ఆ రిపోర్టును కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు సైతం తప్పు పట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, తుమ్మిడి హాట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదన్న తర్వాతనే నిపుణుల సలహాలు, సంప్రదింపులతో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలోమీటర్ల సొరంగాలు,1531కిలో మీటర్ల కాలువలు, 98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత, 240టిఎంసీల వినియోగం కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్టని చెప్పారు. లక్ష కోట్ల కాళేశ్వరం అని ఒకవైపు చెబుతూనే, రూ. 3వేల కోట్లతో కట్టిన మేడిగడ్డను చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారాలను ఎండగట్టేందుకు దశల వారీగా అన్ని ప్రాజెక్టులను సందర్శించనున్నట్టు తెలిపారు.