23న ఛలో సంక్షేమ భవన్: కేవీపీఎస్ బిట్ర సుబ్బారావు

23 Chalo Welfare Bhavan: KVPS Bitra Subbaraoనవతెలంగాణ – అంబర్‌పేట
హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం 23న హైదరాబాద్ సంక్షేమ భవన్ ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని, ధర్నాను విజయవంతం చేయాలని కేవీపీఎస్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ  కార్యదర్శి బిట్ర. సుబ్బారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి సుబ్బారావు మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23వ తేదీన హైదరాబాదులోని సంక్షేమ భవన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2017 వ సంవత్సరంలో పెంచిన మెస్ చార్జీల ధరలతో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నేడు మార్కెట్లో ఉన్న నిత్యావసరాల ధరలు అధికంగా ఉండడం వలన విద్యార్థులకు మెనూ ప్రకారం మెనూ అందడం లేదని అన్నారు. కేవలం ప్రభుత్వం మెనూ చార్ట్  చూపి విద్యార్థుల యొక్క కడుపులను మాడుస్తుందని అన్నారు. రాష్ట్రంలో సుమారు 3 లక్షల 30 వేల మంది విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారని, హాస్టళ్లకు మౌలిక వసతులు శాశ్వత భవనాలు లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వం హాస్టల్లో మరమ్మత్తుల కోసం కొంతమేర నిధులను విడుదల చేస్తామని చెప్పి ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. సంక్షేమ హాస్టల్లో అపరిశుభ్రత రాజ్యం ఏలుతుందని, విషపురుగులు హాస్టల్ లోకి ప్రవేశించి విద్యార్థులకు హాని తలపెడుతున్నాయని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెరిగిన ధరల ప్రకారం రూ.2500 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలని, హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని అన్నారు. రాష్ట్రంలో 858 సంక్షేమ హాస్టల్లు అద్దె భవనాలు కొనసాగుతున్నయని, వీటికి శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నగర నాయకులు జి రాములు, కమిటీ సభ్యులు ఇందిరా, రేణుక,సుజాత, తదితరులు పాల్గొన్నారు.