– ఫైనల్లో సన్‌రైజర్స్‌పై ఘన విజయం
– 2025 ఎస్‌ఏ20 టీ20 లీగ్
జొహనెస్‌బర్గ్ : ఎస్‌ఏ20 టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌కు చుక్కెదురైంది. వరుసగా రెండు సీజన్ల పాటు టైటిల్ సాధించిన సన్‌రైజర్స్ హ్యాట్రిక్ ముంగిట బోల్తా పడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ) కేప్‌టౌన్ చేతిలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌పై 76 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ 20 ఓవర్లలో 181/8 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (38, 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కానర్ (39, 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రియాన్ రికెల్టన్ (33, 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్ (2/39), రిచర్డ్ గ్లీసన్ (2/22), లియాం డాసన్ (2/40) మెరిశారు. ఛేదనలో సన్‌రైజన్స్ ఈస్టర్న్ కేప్ చతికిల పడింది. కగిసో రబాడ (4/25), ట్రెంట్ బౌల్ట్ (2/9), జార్జ్ లిండె (2/20) నిప్పులు చెరగటంతో 18.4 ఓవర్లలో 105 పరుగులకే సన్‌రైజర్స్ కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు డెవిడ్ (5), జోర్డాన్ (1), మార్‌క్రామ్ (6), స్టబ్స్ (15) తేలిపోయారు. టోనీ (26, 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), టామ్ అబెల్ (30, 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆ జట్టును మూడంకెల స్కోరు దాటించారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 76 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ కేప్‌టౌన్ ఘన విజయం సాధించింది. ఎంఐ కేప్‌టౌన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఎస్‌ఏ20 టైటిల్ సాధించటం ముంబయి ఇండియన్స్ కేప్‌టౌన్‌కు ఇదే తొలిసారి. మూడోసారి ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది.