చాంపియన్‌ ప్రణయ్

– కెరీర్‌ తొలి సూపర్‌ 500 టైటిల్‌ సొంతం
– ఫైనల్లో చైనా షట్లర్‌పై ఘన విజయం
– మలేషియా మాస్టర్స్‌ టోర్నీ
కేరళ కుర్రాడు హెచ్‌.ఎస్‌ ప్రణయ్ అదరగొట్టాడు. మలేషియా మాస్టర్స్‌లో మాస్టర్‌ క్లాస్‌ చూపించాడు. చైనా షట్లర్‌ వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌పై మారథాన్‌ ఫైనల్లో ఘన విజయం సాధించాడు. మలేషియా మాస్టర్స్‌ పురుషుల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచిన హెచ్‌.ఎస్‌ ప్రణయ్ కెరీర్‌లో తొలి డబ్ల్యూబిఎఫ్‌ సూపర్‌ 500 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. వరుస టోర్నీల్లో వరుస పరాజయాలు చవిచూస్తున్న భారత బ్యాడ్మింటన్‌కు..
మలేషియా మాస్టర్స్‌ విజయంతో ప్రణరు సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చాడు.
కౌలాలంపూర్‌ (మలేషియా)
భారత బ్యాడ్మింటన్‌ సీనియర్‌ షట్లర్‌. అంతర్జాతీయ సర్క్యూట్‌లో పదేండ్లకుగా పైగా అనుభవం. కెరీర్‌లో లెక్కకుమించి గాయాలు, తీవ్ర అనారోగ్య సమస్య, ఎన్నో సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచుల్లో తలపడిన విశేష ఘనత. అయినా, హెచ్‌.ఎస్‌ ప్రణయ్ భారత బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి షట్లర్‌గా ఎన్నడూ గుర్తింపు దక్కించుకోలేదు. సుదీర్ఘ ప్రస్థానంలో అలుపెరుగని పోరాటం చేసిన హెచ్‌.ఎస్‌ ప్రణయ్ ఎట్టకేలకు కెరీర్‌ తొలి సూపర్‌ 500 టైటిల్‌ను ముద్దాడాడు. కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌పై 21-19, 13-21, 21-18తో ఘన విజయం సాధించిన ప్రణయ్ .. మలేషియా మాస్టర్స్‌ చాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు లిన్‌ డాన్‌, లీ చోంగ్‌ వీలపై సైతం విజయాలు నమోదు చేసిన హెచ్‌.ఎస్‌ ప్రణరు ఇప్పటి వరకు సూపర్‌ 500 టైటిల్‌ సైతం అందుకోకపోవటం గమనార్హం.
సూపర్‌ ప్రణయ్
పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో హెచ్‌.ఎస్‌ ప్రణయ్ మూడు గేముల పోరులో గెలుపొందాడు. చైనా షట్లర్‌ వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌తో ప్రణయ్ పోటీపడటం ఇదే మొదటిసారి. 94 నిమిషాల పాటు సాగిన మారథాన్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ ఆటగాడు అదరగొట్టాడు. తొలి గేమ్‌ను ప్రణయ్ సొంతం చేసుకోగా.. రెండో గేమ్‌ను వెంగ్‌ హాంగ్‌ గెల్చుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మనోడు మెరిశాడు. కెరీర్‌ తొలి సూపర్‌ 500 టైటిల్‌ ప్రణయ్కి అంత సులువుగా దక్కలేదు. చైనా షట్లర్‌తో సుమారు 100 నిమిషాల పాటు కఠోరంగా పోరాడాడు. తొలి గేమ్‌లో ఎవరూ స్పష్టమైన ఆధిక్యం సాధించలేదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ ముందుకు సాగారు. 11-9తో విరామ సమయానికి ప్రణయ్ ముందంజ వేసినా.. ద్వితీయార్థంలో వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ దూసుకొచ్చాడు. 15-12తో మళ్లీ ప్రణమ్‌ మెరిసినా.. చైనా షట్లర్‌ స్కోరు సమం చేశాడు. 18-16తో రెండు పాయింట్ల ఆధిక్యత సాధించిన ప్రణయ్.. అదే జోరులో తొలి గేమ్‌ కైవసం చేసుకున్నాడు. ఆఖరు వరకు పోరాడిన చైనా షట్లర్‌కు నిరాశ తప్పలేదు. ఇక రెండో గేమ్‌ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ రెచ్చిపోయాడు. 9-11తో వెనుకంజలో నిలిచిన ప్రణయ్.. విరామ సమయం అనంతరం ఆశించిన మేరకు రాణించలేదు. వరుసగా ఆరు పాయింట్లు సాధించిన వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ 17-10తో తిరుగులేని ఆధిక్యం దక్కించుకున్నాడు. ఆరంభంలో వరుసగా ఐదు పాయింట్లు సాధించి పుంజుకున్న ప్రణయ్.. ఆ పని ద్వితీయార్థంలో చేయలేకపోయాడు. తొలి రెండు గేములు ప్రణయ్, వెంగ్‌ పంచుకోగా.. చాంపియన్‌ను తేల్చేందుకు మూడో గేమ్‌ అనివార్యమైంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ సైతం తొలి గేమ్‌ తరహాలోనే ఉత్కంఠగా సాగినా.. ప్రణయ్ మ్యాచ్‌ అసాంతం ఆధిక్యంలో కొనసాగాడు. 11-10తో విరామ సమయానికి ముందంజ వేసిన ప్రణయ్.. ఇక ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రణయ్ని వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ వెంటాడినా ఏ దశలోనూ ఆధిక్యంలోకి వెళ్లలేకపోయాడు. 13-10, 14-11, 16-13, 18-16తో దూసుకెళ్లాడు. చివర్లో 18-18 వద్ద స్కోరు సమం చేసిన వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ ఉత్కంఠకు తెరతీశాడు. కానీ వరుసగా మూడు పాయింట్లు కొల్లగొట్టిన ప్రణయ్.. మూడో గేమ్‌తో పాటు కెరీర్‌లో చారిత్రక సూపర్‌ 500 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
మహిళల సింగిల్స్‌లో అకానె యమగూచి (జపాన్‌) 21-17, 21-7తో గ్రెగోరియ టన్‌జంగ్‌ (ఇండోనేషియా)పై, మెన్స్‌ డబుల్స్‌లో కొరియా జోడీ 21-15, 22-24, 21-19తో మలేషియా జంటపై, మహిళల డబుల్స్‌లో కొరియా జోడీ 22-20, 8-21, 21-17తో మలేషియా జోడీపై, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో చైనా జంట 21-16, 13-21, 18-21తో థారులాండ్‌ జోడీపై విజయాలు సాధించి టైటిళ్లు సొంతం చేసుకున్నారు.