మళ్లీ చాంపియన్స్‌ లీగ్‌?!

మళ్లీ చాంపియన్స్‌ లీగ్‌?!– బీసీసీఐ, ఈసీబీ, సీఏ చర్చలు
మెల్‌బోర్న్‌ : ప్రపంచ అత్యుత్తమ టీ20 గ్లోబల్‌ ప్రాంఛైజీలు పోటీపడే టోర్నమెంట్‌ చాంపియన్స్‌ లీగ్‌. ఏడాదికి ఓసారి జరిగే ఈ టోర్నీ వరుసగా ఆరేండ్లు పాటు విజయవంతంగా సాగింది. 2014 తర్వాత చాంపియన్స్‌ లీగ్‌ మరుగునపడింది. గ్లోబల్‌ టీ20 లీగ్‌లు ఉజ్వల స్థితికి చేరుకున్న దశలో మరోసారి చాంపియన్స్‌ లీగ్‌పై చర్చ మొదలైంది. ప్రతిష్టాత్మక ఈ గ్లోబల్‌ టీ20 లీగ్‌ను మళ్లీ నిర్వహించాలనే ఆలోచన పురుడుపోసుకుంది. ఇందుకోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చురుగ్గా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ముంబయిలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విక్టోరియా క్రికెట్‌ సీఈవో నిక్‌ కమిన్స్‌ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘నాకు తెలిసి చాంపియన్స్‌ లీగ్‌ కాలానికి ముందే అభిమానుల ముందుకొచ్చింది. ఆ సమయంలో టీ20 క్రికెట్‌లో ఆశించిన పరిణితి చెందలేదు. ఈ రోజు టీ20 లీగ్‌ స్థాయి వేరు. బీసీసీఐ, ఈసీబీ, సీఏ క్రికెట్‌ బోర్డులు చాంపియన్స్‌ లీగ్‌ కోసం అనువైన విండో కోసం అన్వేషణ జరుపుతున్నాయి. ఈ మేరకు ఈ మూడు క్రికెట్‌ దేశాల బోర్డులు చర్చలు జరుపుతున్నాయి. ఏడాది పొడవునా టీ20 లీగ్‌లతో పాటు ఐసీసీ టోర్నమెంట్లు ఉన్నాయి. చాంపియన్స్‌ లీగ్‌ ఈసారి తొలుత మహిళల క్రికెట్‌లో ప్రారంభం కానుంది. డబ్ల్యూపీఎల్‌, ది హండ్రెడ్‌, డబ్ల్యూబిబిఎల్‌ జట్లు మహిళల చాంపియన్స్‌ లీగ్‌లో పోటీపడే అవకాశం ఉంది’ అని నిక్‌ కమిన్స్‌ అన్నారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవోతో తరచుగా జరిగే చర్చల్లో చాంపియన్స్‌ లీగ్‌పై ప్రస్తావన రాగా ఈ విషయాలు తెలిశాయని కమిన్స్‌ వెల్లడించాడు.చాంపియన్స్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌. చాంపియన్స్‌ లీగ్‌లో భారత్‌ నుంచి మూడు జట్లు.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా నుంచి రెండు జట్లు.. పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ నుంచి ఒక్కో జట్లు చాంపియన్స్‌ లీగ్‌లో పోటీపడేవి. చెన్నై సూపర్‌కింగ్స్‌,ముంబయి ఇండియన్స్‌లు చాంపియన్స్‌ లీగ్‌ను రెండు సార్లు గెల్చుకోగా.. సిడ్నీ సిక్సర్స్‌, న్యూ సౌత్‌వేల్స్‌లు ఓసారి చాంపియన్‌గా నిలిచాయి. నాణ్యమైన క్రికెటర్లు ఒకే వేదికపై పోటీపడే అవకాశం అరుదుగా వస్తున్న ఆధునిక క్రికెట్‌లో చాంపియన్స్‌ లీగ్‌ పునప్రారంభంతో ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌, ఎస్‌ఏ20, ది హండ్రెడ్‌, బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతలు అల్టీమేట్‌గా చాంపియన్స్‌ లీగ్‌లో పోటీపడితే ఆధునిక టీ20 క్రికెట్‌ మరోస్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదు.