చంద్రబాబు అరెస్ట్‌

Chandrababu arrested– నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డుమార్గంలో తరలింపు
– భగ్గుమన్న టీడీపీ శ్రేణులు
– ఎక్కడికక్కడ అడ్డుకునే యత్నం..
– దారిపొడవునా ఉద్రిక్తత
–  పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల నిలిపివేత
–  సిట్‌ సుదీర్ఘ విచారణ..వాట్సాప్‌ చాటింగ్‌పైనా వివరణ కోరిన అధికారులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ అవినీతికి సంబంధించిన కేసులో శనివారం తెల్లవారుజామున నంద్యాలలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను తెల్లవారుజామునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ వార్త తెలియడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అవకాశం ఉంది. అయితే ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తొమ్మిది గంటలు పైగా ప్రయాణానికే పట్టింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆయనను గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడే భువనేశ్వరీ, లోకేశ్‌లు బాబును కలిశారు. అంతకుమందు శుక్రవారం అర్ధరాత్రి నుండే నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాబును అరెస్ట్‌ చేయనున్నారన్న సమాచారం బయటకు తెలియడంతో పెద్దసంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన బసనేసిన ఆర్‌కె ఫంక్షన్‌ హాలువద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం తెల్లవారుజామున ఫంక్షన్‌ హాలు వద్దకు సీఐడీ డీఎస్‌పీ ఎం. ధనుంజయుడు నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్‌ బృందం ఆయనకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 50(1) ప్రకారం నోటీసులు అందచేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ అవినీతికి సంబంధించి క్రైమ్‌ నంబర్‌ 29-2021 కింద నమోదైన కేసులో అరెస్ట్‌ చేస్తున్నట్టు దీనిలో పేర్కొన్నారు. పోలీసులను అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సిట్‌ సుదీర్ఘ విచారణ..
అరెస్టులో భాగంగా చంద్రబాబు నాయుడును సిట్‌ అధికారులు మూడు గంటలపాటు విచారించారు. వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలను సిట్‌ అధికారులు ఆయన ముందుంచి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన కోర్టులోనే తేల్చుకుంటానని సమాధానం ఇచ్చారు. శనివారం ఉదయం ఆరుగంటలకు నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును రహదారి మార్గంలో తీసుకొచ్చి సాయంత్రం 5:10 గంటల సమయంలో కుంచనపల్లిలోని సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారందరినీ నెట్టేసి పోలీసులు చంద్రబాబును సిట్‌ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ లోపలకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వం తరపున ఎఎజి పొన్నవోలు సుధాకరరెడ్డి తదితర న్యాయవాదులు వచ్చారు. చంద్రబాబు తరపున న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లిన తరువాత తన తరపున ఐదుగురు న్యాయవాదులకు అనుమతినివ్వాలని కోరుతూ సిట్‌ అధికారులకు చంద్రబాబు లేఖ ఇచ్చారు. పరిశీలించిన అధికారులు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌తోపాటు మరొకరికి అనుమతినిచ్చారు. అనంతరం విచారణ మొదలుపెట్టారు. సిట్‌ తరపున ఇద్దరు అధికారులు విచారణలో పాల్గొన్నారు. సీమెన్స్‌ కుంభకోణానికి సంబంధించి 20 ప్రశ్నలను చంద్రబాబు ముందు ఉంచారు. అసలు ఈ కంపెనీతో ఒప్పందం ఎప్పుడు జరిగింది? క్యాబినెట్లో ఏమి నిర్ణయం తీసుకున్నారు? కంపెనీ వాటా ఇవ్వకుండా డబ్బులు ఎందుకు జమచేశారు? అవి ఎక్కడికి వెళ్లాయి? డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు ఎవరు పెట్టారు? వాటి ఖాతాలు మీకు తెలుసా! వంటి అనేక ప్రశ్నలను చంద్రబాబు ముందు ఉంచారు. విచారణ జరుపుతున్న మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశారు. సుమారు 10 గంటల పాటు ప్రయాణం చేయించడంతోపాటు మూడున్నర గంటలపాటు ఆయనను సిట్‌ కార్యాలయంలోనే కూర్చోబెట్టారు. ఆదివారం ఉదయం ఆరుగంటల వరకూ వారికి సమయం ఉండటంతో ఆలోపు ఎప్పుడైనా జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాల్సి ఉండటంతో విజయవాడ ఆసత్రి ముందు భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు కోసం ప్రత్యేక రూము సిద్ధం చేశారు. చంద్రబాబు తరపున కోర్టులో వాదనలు వినిపించేందుకు ప్రత్యేక విమానంలో వచ్చిన న్యాయవాది సిద్ధార్థ్‌ లూత్రా ఎసిబి కోర్టులో చంద్రబాబు కోసం ఎదురు చూస్తూ కూర్చుండిపోయారు. ప్రభుత్వం తరపున ఎఎజి వాదనలు వినిపించనున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా :కేబీఆర్‌ పార్కు ఎదుట ధర్నా
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఆ పార్టీ తెలుగుదేశం రాష్ట్ర శాఖ ఖండించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ ఎదురుగా ఉన్న కేబీఆర్‌ పార్క్‌తోపాటు ట్యాంక్‌బండ్‌ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు భైఠాయించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంట్‌ పార్టీ కమిటీల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పొలిట్‌ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, ఉపాధ్యక్షులు సామా భూపాల్‌ రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు ఐలయ్య యాదవ్‌, గడ్డి పద్మావతి, బండారి వెంకటేష్‌ ముదిరాజ్‌, జీవీజీ నాయుడు, షేక్‌ ఆరీఫ్‌, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు ఎన్‌.దుర్గాప్రసాద్‌ ,సూర్యదేవర లత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షులు సుభాష్‌ యాదవ్‌, మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ అధ్యక్షులు కందికంటి అశోక్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
ఓడిపోతామనే భయంతోనే: కాసాని
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబును సంబంధంలేని కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ విమర్శించారు. ఎన్నికలు రానే లేదు, అప్పుడే జగన్‌లో భయం పుట్టుకుందని వ్యాఖ్యానించారు. అనవసర కేసులతో చంద్రబాబును ఇబ్బందిని పెట్టాలని చూస్తున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్య శక్తులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ సైకో చర్యలకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాలు, ప్రధాన కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని సూచించారు.
అరెస్టు తీరు తీవ్ర అభ్యంతరకరం : సీపీఐ(ఎం),
అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా విచారణ జరపాలని కోరారు. అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలను రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్బంధం చేసి, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను అనుమతించకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఈ అరెస్టులను తమ పార్టీ ఖండిస్తుందని, అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని కోరారు.