– నేడు విచారణ
– బాబు భద్రతపై భయంగా ఉంది : ములాఖత్ అనంతరం భువనేశ్వరి
అమరావతి : ఏపీ సిల్క్ డెవలప్‌మెంట్ సంస్థ(ఏపీఎస్‌ఎస్డీసీ) నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. దీంతో బుధవారం విచారణ నిర్వహిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఆమేరకు సీఐడీ సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశారు. పిటిషన్‌లో రాజకీయ కక్షతో తనపై తప్పుడు కేసు బనాయించారని పేర్కొన్నారు. ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ)లోని సెక్షన్ 17ఏ ప్రకారం పిటిషనర్ చంద్రబాబు పబ్లిక్ సర్వెంట్ కాబట్టి కేసు నమోదు చేయాలంటే గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. కేసు నమోదు, విచారణకు గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఆ విధంగా సిఐడి చేయలేదు. నిజానికి ఈ కేసు ఎంపి, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టు పరిధిలోకి వస్తుంది.’ అని పేర్కొన్నారు. ‘2021 డిసెంబర్ 09న నమోదు చేసిన ఈకేసులో 22నెలలు గడిచాక తీరుబడిగా కావాలనే అరెస్టు చేసింది. కేసులో కావాలని ఇరికించింది. రాజకీయ ప్రతీకారంతో కేసులోకి ఇరికించారు. సిఎం ప్రోద్బలంతోనే కేసు పెట్టారు. గతంలో తీవ్రవాదుల దాడి నుంచి బయటపడ్డాను. ప్రాణాలకు హాని ఉందనే కేంద్రం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. రాజకీయ ప్రత్యర్థులు కూడా అంతమొందించేందుకు కుట్ర చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సెక్యూరిటీ లేకుండా జైల్లో ఉంచకూడదు. సెక్యూరిటీకి దూరం చేస్తే ప్రత్యర్ధులను టార్గెట్ చేయవచ్చునని అధికారపార్టీ చీఫ్‌కు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాకుండా హౌస్ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలన్న వినతిని కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించడం అన్యాయం. అరెస్టు కూడా ఏకపక్షంగా చట్ట వ్యతిరేకంగా జరిగింది.’ అని పిటిషన్‌లో తెలిపారు.
‘అనేక విషయాలను కింది కోర్టు విస్మరించింది. ఏసీబీ యాక్ట్‌లోని 13(1)(సి)(డి) ప్రకారం నేరపూరిత దుష్పప్రవర్తను పాల్పడినట్లుగా ఆధారాలు సీఐడీ చూపలేదు. సెక్షన్ 17 ప్రకారం గవర్నర్ నుంచి అనుమతి పొందిన తర్వాతే కేసు నమోదు/విచారణ చేయాలన్న నిబంధన ఉల్లంఘన జరిగింది. ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని 2021లో సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ చేయాల్సిన కేసును ఏసీబీ కోర్టు విచారణ చేసేందుకు వీల్లేదు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌్‌ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయండి. హైకోర్టులో పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు ఏసీబీ కోర్టు విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వండి’ అని చంద్రబాబు పిటిషన్‌లో కోరారు.
బాబు భద్రతపై భయంగా ఉంది : ములాఖత్ అనంతరం భువనేశ్వరి
జైల్లో చంద్రబాబు భద్రతపై భయంగా ఉందని ఆయన భార్య భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నిందితుడైన చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం
సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ములాఖత్‌లో భాగంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆయనను మంగళవారం కలిశారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచించేవారని, తనకు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని అనేవారని చెప్పారు. జైలులో సరైన వసతులు లేవన్నారు. ఇది తమ కుటుంబానికి క్లిష్ట సమయమన్నారు. పార్టీకి, కేడర్‌కు ఎప్పుడూ తమ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. ఏపీని జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు రాత్రింబవళ్లుతన భర్త పని చేశారన్నారు. ఇలాంటి వ్యక్తిని వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి అక్రమ కేసులో ఇరికించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం పోరాడుతున్నారనే జైలులో పెట్టారని విమర్శించారు. తాము ఏనాడూ ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికిగానీ, సచివాలయానికిగానీ వెళ్లలేదని, నేడు ఆయనను చూడడానికి జైలుకు రావడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. చంద్రబాబును చూసి బయటకు వస్తుంటే ఏదో కోల్పోయిన్నట్లుగా ఉందని చెప్పారు. తాను బాగానే ఉన్నానని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు చెప్పారని భువనేశ్వరి తెలిపారు.
శాంతి భద్రతల సమస్య రాకూడదు : ఏపీ సీఎం
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లండన్ పర్యటన అనంతరం మంగళవారం ఉదయం ఆయన తాడేపల్లి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సిఎస్ జవహర్‌రెడ్డి, డిజిపి కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులతో జగన్మోహన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకూడదని తెలిపారు.