సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌

– మెన్షన్‌ చేసిన సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ ను దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌ ను చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా… సీజేఐ జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలోని పలు అంశాలను లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు ఏపీకి చెందినదని, అధికార పార్టీ పూర్తిగా ప్రతిపక్షాలను అణచివేస్తోందని వివరించారు. చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని లూథ్రా కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ… ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారని ప్రశ్నించగా.. ఈనెల 8 నుంచి ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు లూథ్రా తెలిపారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ… నేడు(మంగళవారం) మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్‌ రోహత్గీ, సీఐడీ తరపున వాదించిన రంజిత్‌ కుమార్‌లు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.