నవంబర్‌ 1 వరకూ చంద్రబాబుకు రిమాండ్‌

Chandrababu remanded till November 1రాజమహేంద్రవరం : స్కిల్‌ స్కామ్‌ కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను నవంబర్‌ 1 వరకూ ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌జైలులో ఆయన 40 రోజులుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. గురువారంతో రిమాండ్‌ గడువు ముగియడంతో చంద్రబాబును జైలు అధికారులు వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఏసీబీ న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. తన భద్రత విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు న్యాయమూర్తికి తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని న్యాయమూర్తి చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు పంపించాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులను ప్రశ్నించారు. మెడికల్‌ రిపోర్టులను ఎప్పటికప్పుడు కోర్టుకు సబ్‌మిట్‌ చేయాలని ఆదేశించారు. అనంతరం రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. లీగల్‌ ములాఖత్‌ను పెంచాలని, రోజుకు మూడు ములాఖత్‌లు ఇవ్వాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఎసిబి కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.