– వచ్చే నెల 20,21 తేదీల్లో హైదరాబాద్‌లో కమ్మ మహాసభ
– హాజరుకానున్న ఇరువురు సీఎంలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌లు ఒకే వేదికను పంచుకోనున్నారు. వచ్చే నెల 20,21 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే కమ్మ మహాసభకు వారిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సీఎంలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు, రేవంత్ ఇప్పటి వరకూ కలుసుకోలేదు. అందువల్ల జులైలో వారి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గత డిసెంబరులో రేవంత్ సీఎంగా ప్రమాణం చేసినప్పటికీ… అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కాలేదు. అటువైపు నుంచి జగన్ కూడా రేవంత్‌ను కలవలేదు. ఈలోగా ఏపీలో ఎన్నికలు రావటం, ఆ తర్వాత జగన్ ఓడిపోవటం చకచకా జరిగాయి. అనంతరం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్‌కు ఆహ్వానం అందిందా? లేదా ? అన్నది తెలియదుగానీ, ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉన్న నేపథ్యంలో… ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎంగా రేవంత్ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారనే అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో త్వరలో జరగబోయే వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకే వేదికను పంచుకోనున్న సీఎంలు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చిస్తారా? లేదా..? అన్నది వేచి చూడాలి. కాగా కమ్మ మహాసభకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరుకానున్నారని నిర్వాహకులు జెట్టి కుసుమకుమార్ తెలిపారు.