తెలంగాణపై చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి కుట్ర

– చూస్తూ ఊరుకునేది లేదు: మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిలు కలిసి తెలంగాణపై కుట్ర చేస్తే ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హెచ్చరించారు. చంద్రబాబు కనుసైగలతో రేవంత్‌ రెడ్డి పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం హైదరాబా ద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలపడంపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో పోరాడారని గుర్తుచే శారు. అదే విధంగా కాంగ్రెస్‌ ఎంపీ లు పోరాడాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో పని చేసిన ఆదిత్యనాథ్‌ దాస్‌ను తెలంగాణ ఇరిగేషన్‌ సలహాదారుగా నియమించడం సరికాదని ఆయన తప్పుపట్టారు. ఆ నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భద్రాచలం రూరల్‌ మండలంలో వున్న యటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా కృషి చేయాలని రేవంత్‌ రెడ్డిని కోరారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు.