అమరావతి : మిచౌంగ్ తుపాను వల్ల రాష్ట్రంలో తీవ్ర నష్టం జరిగిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని టీడీనీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతిశాయనీ, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలుస్తోందని తెలిపారు.
పంట నష్టపోయిన ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.10 వేలకోట్ల వరకు పంట నష్టం ఉంటుందని అంచనా వేశారు. పంటలతోపాటు పలుచోట్ల పశువులు చనిపోయాయని, చెట్లు విరిగిపడ్డాయని, దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగిందని తెలిపారు. వ్యవసాయంతోపాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందని పేర్కొన్నారు. పడవలు, వలలకు నష్టం జరగడంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని వివరించారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపాలని కోరారు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే తక్షణ, మెరుగైన సహాయం బాధితులకు అందుతుందని అన్నారు.
చేతల్లో మానవత్వం చూపండి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటల్లో కాకుండా చేతల్లో కొంచెం మానవత్వం చూపాలని చంద్రబాబు కోరారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వం పెన్షన్ నిలిపివేయడంతో గిరిజన మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం అని అన్నారు.