రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రాణహాని

Chandrababu's life is in danger in Rajahmundry Jail–  టీడీపీ అధ్యక్షుడు కాసాని ఆందోళన
నవతెలంగాణ-హైదరాబాద్‌
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ప్రాణహాని జరిగే అవకాశం ఉందని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు రాజమండ్రి జైలులో సరైన వైద్య సదుపాయాలతో పాటు.. కనీస సౌకర్యాలు లేవన్నారు. అక్కడి ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. చంద్రబాబుకు ప్రాణహాని జరిగితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సర్కారు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు కావాల్సిన వైద్య సదుపాయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని హితవుపలికారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు.సౌకర్యాలు కల్పించడంలో జగన్‌ సర్కారు పూర్తిస్థాయిలో విఫలమైందన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక డాక్టర్ల బృందంతో వైద్యచికిత్స అందించాలని కోరారు. చంద్రబాబును ఒక తీవ్రవాది మాదిరిగా పరిగణించడాన్ని ఖండించారు. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారని గుర్తు చేశారు. ఇది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ఆయనకి రక్షణగా ఒకే ఒక్క కాని స్టేబుల్‌ తప్ప ఇతరులేవరూ లేరన్నారు. పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. భవిష్యత్తులో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు త్వానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజు నాయక్‌, అధికార ప్రతినిధి ముప్పడి గోపాల్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షులు పి. సాయి బాబా, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు హబిబ్‌ అహ్మద్‌, రాష్ట్ర కార్య నిర్వహకకార్యదర్శి పెద్దోజు రవీ ంద్రచారి, మహేశ్వరం ఇన్‌ఛార్జి ఎడ్ల మల్లేశ్‌ పాల్గొన్నారు.