చంద్రయాన్‌… ఓట్లయాన్‌!

ఇప్పుడంతా చంద్రమయం. చంద్ర యానమయం. ప్రతి ఒక్క అవకాశాన్నీ క్యాష్‌ చేసుకునే సమయం. ఓట్ల రూపంలో ఎలా మార్చుకోవాలో అన్న ఆశావహులమయం నేటి రాజకీయం. ఆ ఓట్లకు చంద్రుడైనా, సూర్యుడైనా, శని అయినా ఒకటే. అసలు గ్రహాలేవి, ఉపగ్రహాలేమి అన్న విషయం ఒదిలేసి కత్రిమ ఉపగ్రహాల వెంటపడే సమయం. ఎవరి పేరైతే ఎత్తకూడదో ఒకవేళ ఎత్తినా దూషించ డానికే పనికొచ్చే ఆ పేర్లను పక్కన పెట్టి, వారి సమ యంలో విరిసిన వైజ్ఞానిక విజయాలను తమవిగా చేసుకునే నిస్సిగ్గు మయం, నేటి రాజకీయం. అసలు మువ్వన్నెల జండా అంటేనే ఎగిరిపడే, చీదరించుకునే వాళ్ళే ఇప్పుడు ఆ జండా పట్టుకుని తమ అజెండాతో ముందుకు పోతున్న సమయం. అమావాస్య రోజున కూడా వెన్నెల కురిపిస్తున్న వారొక వైపు కండ్లున్నా కబోదుల మాదిరి ఒకపక్క మాత్రమే చూస్తున్న వాళ్లు ఇంకో వైపు. ఇప్పుడంతా కండ్లున్న కబోదులమయం, చెవు లున్న చెవిటివాళ్ల మయం, నోరున్న మూగవాళ్ల మయం, మెదడున్నా గుజ్జులేని పుర్రెలమయం. కోతుల నుండి మానవులు వచ్చారని చెబితే నమ్మరు కాని, మూడు కోతులను మాత్రం నమ్ముతారు. అవి కండ్లు మూసుకొమ్మంటే కండ్లు, నోరు మూసుకొమ్మంటే నోరు, చెవులు మూసుకొమ్మంటే చెవులు మూసుకొని తమభక్తి నిరూపిస్తారు. అదే జాతీయత అని పాఠాలు బోధిస్తారు.
ఇక ఉగాదినాటి పంచాంగ శ్రవణంలోనే వైజ్ఞానిక రంగంలో, అంతరిక్ష రంగంలో దేశఖ్యాతి పెరుగు తుందని ఉందని, కావలిస్తే చూడండి అని మిత్రుడొ కాయన పోస్టు పెట్టాడు. మన సంఖ్యా శాస్త్రం, జ్యోతి శాస్త్రం ప్రకారం ముందే ఈ విజయాన్ని ఖరారు చేసుకున్నామన్నాడు. నాదొక్కటే ప్రశ్న, మరి మణి పూర్‌ గురించి ఆ పంచాంగ శ్రవణంలో ఎందుకు లేదు అని. సమాధానం ఎటూ ఉండదు. సమాధా నాలు చెప్పవలసిన అవసరం తమకు లేదని, మా ఇష్ట మొచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతామని, పెద్దోళ్లుచెబుతుంటే వినాలే తప్ప మాట్లాడకూడదని భక్తుల ఉవాచ. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా అంటూనే అన్నాన్ని మాత్రమే కోరుకునే వాళ్ళే అసలైన సిసలైన దేశభక్తులు, భోక్తలు. ఇందాకే అనుకున్నట్టు చంద్రుడైతేనేమిరా అని కొత్తగా రాసుకోవాలి. రాహువు, కేతువు చంద్రుడిని మింగి నాయని ఎన్నో ఏండ్లు నమ్మించిన వాళ్ళే ఇప్పుడు చంద్రుడిని మింగేస్తున్నారు ఇంఖో రకంగా. చంద్రుడితో పాటు జనుల జ్ఞానాన్ని పక్కదోవ పట్టించి మరీ ముందుకు పోతున్నారు. లక్ష్మీదేవిని రకరాల పేర్లతో మొక్కుతుంటారు. చంద్ర సహోదరి అని ఆమెను మొక్కేటప్పుడు కీర్తిస్తారు. ఇప్పుడు మ్యాటర్‌ రివర్సయింది. చంద్రుడిని లక్ష్మి సహోదర అని ఆ డబ్బుతో మాకు ఓట్లను కొనిపెట్టు అని చెబు తునట్టుగా లేదూ..? అందుకే ఆ చంద్రుడిని గట్టిగా పట్టుకున్నరు. అసలు చంద్రుడిపై అన్ని పేటెంట్‌ హక్కులూ మావేనని నమ్మబలుకుతున్నరు. నీల్‌ఆర్మ్‌ స్ట్రాంగ్‌ దిగింది అసలైన చంద్రుడి మీద కాదని చెబు తారు కూడా. మా చంద్రయాన్‌ దిగింది మాత్రమే అసలైన చందమామ అంటారు. మా వాస్తు ప్రకారం చంద్రుడి దక్షిణ ధృవంపై దిగాలనుందని కూడా చెబుతారు.
వినాయక చవితి రాబోతోంది. చవితి చంద్రుడు ఇప్పుడు సవతి చంద్రుడు కాకుండా చూసుకుంటు న్నారు. ఇతరులు ఏమాత్రం తమ చంద్రుడిని ముట్టు కోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ చంక లోనే ఎత్తుకుంటున్నారు. తమ భుజంపైనే మోస్తు న్నారు. నువ్వే మా ఇంద్రుడివి అంటూ తమ సింహా సనాన్ని కాపాడుకునే పనిలో ఉన్నారు. శాస్త్ర విజ్ఞా నాన్ని పెంచే పరిశోధనా సంస్థలు, ఉక్కు కర్మాగా రాలు, డ్యాములు, పవర్‌ ప్లాంట్లు మొదలైనవే ఆధునిక దేవాలయాలన్న నెహ్రూ మాటలు వినబడ కుండా చేసి దేవాలయాలే ఆధునిక ఓట్ల కర్మాగారాలు అన్న దిశగా అడుగులేస్తున్నారు. ఆ ఓట్లను రాబట్టు కునే విషయంలో తమకు అనుకూలమైన మిత్రులను మరవక పోవడం చూసి ఇంత స్నేహం ఎక్కడా కనబడదని దాన్నీ ఎక్కువగా చేసే విశ్వవిద్యాల యాలూ ఉన్నాయి. వాళ్ళేమి చెబితే దాన్ని పాటించే వారూ సిద్ధంగా ఉంటారు.
ఇక రెండు రాష్ట్రాల్లోనూ ఇద్దరు చంద్రులున్నారు. ఈసారి కూడా నేనే వస్తానని ఒక చంద్రుడు, ఒకసారి పరీక్షలో తప్పినా ఈసారి బాగా రాసి, మంచి మార్కులు సంపాదించుకొని తప్పకుండా పాసైపో తానని, తిరిగి చక్రం తిప్పుతానని ఒక చంద్రుడు అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. చంద మామ రావే, జాబిల్లి రావే అని పిలిచినట్టు ప్రజలు ఈసారీ నన్నే పిలుస్తారని, వెన్నెలలాంటి పాలన అంది స్తామనీ చెబుతారు. ఆ విధంగా ముందుకుపోతూ చంద్రప్రతాపాన్ని చూపిస్తున్నారు. అసలు సూర్యుడి గురించి మాత్రమే సూర్యప్రతాపమని అంటారు. ఆయన కాంతి పడితేనే చంద్రుడు ప్రకాశిస్తాడని సైన్సు చెబుతుంది. అదేవిధంగా మేము నిధులిస్తేనే మీరు ఏదైనా చేయగలరని చంద్రుల వెన్నెల చంద్రు డిది కాదని తమదేనని చెప్పే అవకాశమూ ఉంది.
మొత్తం పైన చంద్రుడు ఈ మధ్య వార్తల్లో ప్రము ఖంగా కనిపిస్తున్నాడు. తాను కనిపించినా, తనపై మనుషులు దిగినా, ప్రయోగశాలలు దిగినా కూడా వార్తే. రష్యానే ఫెయిల్‌ అయింది, మనం పాస్‌ అయ్యా మంటే నిజంగా గ్రేటే. ఎవ్వరూ కాదనరు. మనమూ పరీక్ష తప్పినరోజులున్నాయి. సరిచేసుకొని ఇప్పుడు మంచి మార్కులతో పాస్‌ అయ్యామంతే. అయితే ఆ మార్కులు ఎవ్వరివన్నదే అసలైన ప్రశ్న. విద్యార్ధి మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ ఖ్యాతి తలిదండ్రు లదా, చదువు చెప్పిన ఉపాధ్యాయులదా, లేదా ఆ పాఠశాలదా అంటే అందరిదీనూ. అంతే తప్ప ఇదంతా నాగొప్పే అని జెండా ఊపితే అంతా ఐపోయి నట్లేనా? ఐనుస్టీను, న్యూటను మొదలైన పెద్ద శాస్త్ర వేత్తలే తాము ఇంకొకరి భుజాల మీద ఉన్నందుకే ఎక్కువ దూరాన్ని చూడగలుగుతున్నాము అన్నప్పుడు మిగతావాళ్ళెంత. తమకంటే ముందున్నవాళ్లు ఇచ్చిన విజయాలను మరచిపోతే ఎలా. ఒకవేళ విద్యార్ధుల సిలబస్‌ మార్చినట్టు, భారతదేశ చరిత్ర కూడా తామొచ్చినప్పటి నుండి మాత్రమే మొదలైంది. అందుకే ముందున్న విషయాలను తొలగిస్తు న్నాము అనే ఛాన్స్‌ ఉందో ఏమో చూడాలి. భారత్‌, అఖండ భారత్‌ ఇలా ఎన్ని ఉన్నా, మనకు ఇండియా కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి.

జంధ్యాల రఘుబాబు
9849753298