– క్షేత్రస్థాయి అధ్యయనం చేయాలని ఆదేశం
– సమగ్ర డీపీఆర్ రూపొందించాలి
– మెట్రో ఉన్నతాధికారులతో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
చాంద్రాయణగుట్ట కేంద్రంగా ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణ సాధ్యసాధ్యాలపై మెట్రో అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితు లపై అధ్యయనం చేయాలని నిర్ణయించడంతో పాటు సమగ్ర డీపీఆర్‌లు రూపొందించాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సంబంధింత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రెండో దశ, మూడవ దశ విస్తరణపై ఇటీవల మెట్రో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అత్యధిక మంది ప్రయాణీకులకు ఉపయోగపడే విధంగా మెట్రోరైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సూచించడంతో పాటు హెచ్‌ఎండీఏ కమిషనర్‌తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలని మెట్రోరైలు ఎండీని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవన్‌లో హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 సవరణ రూట్ ప్రతిపాదనలపై మెట్రో ఎండీ ఇంజనీరింగ్ నిపుణులు, మెట్రో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగోల్-ఎల్‌బీనగర్-మైలార్‌దేవ్‌పల్లి-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏ భాగం అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. నాగోల్-ఎల్‌బీనగర్-మైలార్‌దేవ్‌పల్లి-ఎయిర్‌పోర్ట్ లైన్‌లో ఉన్న చాంద్రాయణగుట్ట వరకు ఎంజీబీఎస్-ఫలక్‌నుమాను మరో ఒకటిన్నర కి.మీ పొడిగించడం, ఓల్డ్ సిటీ టూ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ కోసం ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌గా చాంద్రాయణగుట్టను అభివృద్ధి చేయడంపై చర్చించారు. అయితే చాంద్రాయణగుట్టలో ఇరుకైన రహదారి వెడల్పు, అక్కడ ఫ్లైఓవర్ ఉనికిని దృష్టిలో పెట్టుకొని రైలు రివర్సల్, స్టేబ్లింగ్ లైన్ల ఏర్పాటులో ఉన్న సంక్లిష్టతలు, సాధ్యమయ్యే సాంకేతిక పరిష్కారాలపై కూడా అధికారులు ఆలోచనలు చేశారు. దేశంలో అందుబాటులో ఉన్న ఇతర సిగలింగ్ టెక్నాలజీలు, కోచ్‌ల స్వీకరణకు వ్యతిరేకంగా ఒకే విధమైన సిగలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, కోచ్‌లను అనుసరించడం వల్ల కలిగే లాభాల నష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదే విధంగా, కొత్త డిపోల స్థానం, కొత్త ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్లు(ఓసీసీ), మైలార్‌దేవ్‌పల్లి-ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో కొంత విస్తీర్ణంలో ”ఎట్ గ్రేడ్” మెట్రోను ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలు, పరిష్కారాలతో పాటు ముఖ్యంగా ఫేజ్-2లో ఖర్చు తగ్గింపును సాధించడానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తక్కువ ఖర్చుతో మెట్రో నిర్మాణానికి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త రూట్లలో మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు, రైడర్‌షిప్‌ను పెంచడం కోసం వివిధ మెట్రోల ఉత్తమ పద్ధతులు, ఫేజ్-1 అభ్యాసాలను అధ్యయనం చేయాలని ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లు, కన్సల్టెంట్‌లను ఆదేశించారు. కొత్త మెట్రో స్టేషన్లలో తగిన పార్కింగ్ సౌకర్యాలు, చివరి మైలు కనెక్టివిటీ, పాదచారుల సౌకర్యాలు, లగేజీ కోసం స్థలం మొదలైన వాటికి డీపీఆర్‌లను సిద్ధం చేసేటప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలని మెట్రో ఎండీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్ సిగల్ అండ్ టెలికాం ఇంజినీర్ ఎస్.కె. దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్ రెడ్డి, బీఎన్ రాజేశ్వర్, కన్సల్టెన్సీ సంస్థకు చెందిన మెట్రో రైలు నిపుణులు పాల్గొన్నారు.