– చైనా అంతరిక్ష ప్రయోగాల్లో కీలక ముందడుగు
చైనా : చైనాకు చెందిన లూనార్ ల్యాండర్ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి ఆవలి వైపు ల్యాండయినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. బీజింగ్ కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం అయిట్కిన్ బేసిన్ పేరిట ఉన్న ప్రదేశంలో చాంగే-6 సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముందడుగు. ఇప్పటి వరకు ప్రయోగించిన వాటిల్లో ఇదే అత్యాధునికమైంది. అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయలుదేరనుంది. గతంలో 2019లో కూడా చైనా చాంగే-4ను చంద్రుడి ఆవలివైపునకు ప్రయోగించింది. తాజాగా పంపిన ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీఎంట్రీ మాడ్యూల్ అనే నాలుగు రకాల పరికరాలున్నాయి.
53 రోజులు ప్రయాణించి…
మే 3వ తేదీ చాంగే-6 నింగికెగిరి.. దాదాపు 53 రోజులపాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. అక్కడ రోబోల సాయంతో తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టిని ఇది భూమిపైకి తీసుకురానుంది. ఇందుకోసం సుమారు 14 గంటల సమయం పట్టనుంది. ఆ తర్వాత అసెండర్ మాడ్యూల్.. చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళుతుంది. చంద్రుడి కక్ష్యలోని ఆర్బిటర్‌తో అనుసంధానమవుతుంది. అనంతరం ఈ శాంపిళ్లు ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్‌లోకి చేరుతాయి. 2030 నాటికి అక్కడికి వ్యోమగాములను పంపేందుకు యత్నాలను చైనా వేగవంతం చేయనుంది. చంద్రుడికి సంబంధించి మనకు ఎప్పుడూ కనిపించే ఇవతలి భాగం నుంచి చైనా ఇప్పటికే నమూనాలను సేకరించి, భూమికి తీసుకొచ్చింది. తాజా యాత్ర ద్వారా జాబిల్లికి ఆవలి వైపు వాతావరణంతోపాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్ సెన్సింగ్ పరిశీలనల్లో వెల్లడైంది.