మార్పు మొదలైంది!

change
It has begun!– తొలిసారి ఎన్నికల బరిలో జిల్లా క్రికెట్‌ ప్రతినిధి
– శుక్రవారం హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు
హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల వారంలోకి అడుగుపెట్టింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం అపెక్స్‌ కౌన్సిల్‌కు ఎన్నికలకు జరుగనున్నాయి. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా.. అపెక్స్‌ కౌన్సిల్‌లోని ఆరు పదవులకు నాలుగు ప్యానల్స్‌ పోటీపడుతున్నాయి. ఎన్నికలు, బహుముఖ పోటీ హెచ్‌సీఏకు కొత్త కాదు. కానీ, ఈ సారి ఎన్నికల బరిలో నిలిచిన ఓ అభ్యర్థి హెచ్‌సీఏ ఎన్నికలను మరింత ప్రత్యేకం చేశారు. అయనే, కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు ఆగమ్‌ రావు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం చరిత్రలోనే తొలిసారి జిల్లా క్రికెట్‌ సంఘాల నుంచి ఓ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. 1934లో మొదలైన హెచ్‌సీఏకు ఘన చరిత్ర ఉంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వ్యవస్థాపక సభ్య రాష్ట్ర సంఘంగా బీసీసీఐలోనూ హెచ్‌సీఏకు మంచి గుర్తింపు ఉండేది. అయినప్పటికీ.. ఇన్నేండ్ల హెచ్‌సీఏ చరిత్రలో ఎన్నడూ జిల్లా క్రికెట్‌ సంఘం తరఫున ఎవరికీ అవకాశం కల్పించలేదు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అంటే హైదరాబాద్‌ పరిధిలోని క్లబ్‌లకు చెందిన వ్యక్తులే పాలించాలనే సంప్రదాయానికి చెక్‌ పెడుతూ.. కార్యదర్శి పదవికి ఆగమ్‌ రావు పోటీలో నిలిచారు. నాలుగు ప్యానల్స్‌ పోటీపడుతున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో వి. ఆగమ్‌ రావు విజయావకాశాలు ఎలాగున్నా.. కీలక కార్యదర్శి పదవికి పోటీపడుతూ జిల్లా క్రికెట్‌ సంఘాల ఉనికి నిలబెట్టారని టాక్‌ వినిపిస్తోంది. బహుళ యాజమాన్యంలోని 57 క్లబ్‌లపై వేటు వేయటంతో అందరికీ సమాన అవకాశాలు ఏర్పడినట్టు అయ్యాయి. హెచ్‌సీఏలో మార్పు దీనితోనే మొదలైందని చెప్పవచ్చు.
ఏడాది పొడవునా క్రికెట్‌ పోటీలు
‘ఆరేండ్లుగా కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కోవిడ్‌ మహమ్మారితోనే సగం కాలం గడిచినా.. మిగతా సమయంలోనే కరీంనగర్‌ ప్రీమియర్‌ లీగ్‌, తెలంగాణ టీ20 లీగ్‌, అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీలను నిర్వహించాను. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్‌, కాలేజ్‌, కార్పోరేట్‌ తేడా లేకుండా అన్ని రకాల, అన్ని స్థాయిల క్రికెట్‌ కార్యకలాపాలను హెచ్‌సీఏ గొడుగు కిందకు తీసుకురావాలనేది నా ఆలోచన. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ క్రికెట్‌ అభివద్ధికి మా దగ్గర మంచి ప్రణాళికలు ఉన్నాయి. ఏడాది పొడవునా క్రికెట్‌ పోటీలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని’ ప్యానల్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తరఫున కార్యదర్శి పదవికి పోటీచేస్తున్న ఆగమ్‌ రావు తెలిపారు.