రాష్ట్రపతి భవన్‌లో రెండు హాళ్ల పేర్లలో మార్పు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండు ప్రధాన హాల్స్‌ పేర్లను మార్చుతు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు. దర్బార్‌ హాల్‌ పేరును గణతంత్ర మండపంగా, అశోక హాల్‌ను అశోక మండపంగా మార్పు చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రెటరీ నవిక గుప్తా ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి కార్యాలయం, నివాసమైన రాష్ట్రపతి భవన్‌, దేశానికి చిహ్నమని, ప్రజల అమూల్యమైన వారసత్వమని అన్నారు. ఈ భవన్‌ను దేశ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ దిశలో రాష్ట్రపతి భవన్‌ భారతీయ సాంస్కృతిక విలువలు, తత్వాలను ప్రతిబింబించేలా చేసేందుకు స్థిరమైన ప్రయత్నం జరిగిందన్నారు. ఇందులో భాగంగా దర్బార్‌ హాల్‌, అశోక్‌ హాల్‌ను గణతంత్ర మండపం, అశోక్‌ మండపం అని పేరు మార్చడానికి సంతోషిస్తున్నట్టు తెలిపారు.