మార్పు మిథ్య

Change is an illusion‘మార్పు మిథ్య, మోడీయే సత్యం!- మోడీ పదేండ్ల పాలనలో దేశానికి ఒరిగింది ఏమీ లేదు. బహుశా భవిష్యత్తులో కూడా ఒరిగేది ఏమీ ఉండదు. ఏకపక్ష, నిరంకుశ విధానాలు ఇక చెల్లవంటూ.. 303 స్థానాల నుంచి 63 స్థానాలకు కోత పెట్టి, 240 సీట్లకు పరిమితం చేసినా.. అంగీకరించే నైతికత ఇసుమంతైనా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు షరతులతో కూడిన ప్రజామోదాన్ని నరేంద్ర మోడీ పొందారు. అయితే ప్రజా తీర్పుపై వ్యక్తమైన ప్రజల అభీష్టాన్ని ఆయన గుర్తించలేదు. ఈ దురహంకారం ఆయన స్వాభావికమైనదని మరి చెప్పనవసరం లేదు. అత్యధిక ప్రజలు ఎదుర్కొం టున్న ఆకలి, నిరుద్యోగం, దారిద్య్రంపై గతంలో ‘ఫ్యాన్‌ ఇండియా- (ఫైనాన్షియల్‌ అకౌంటబులిటీ నెట్‌ వర్క్‌ ఇండియా) విడుదల చేసిన బ్లాక్‌ పేపర్‌ ఇప్పటికీ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంది.
మతం పేరుతో సమీకరణాలు జరుపుతూ, వైషమ్యాలు పెంచడమే అజెండాగా గతంలో ముందుకు తీసుకొచ్చిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’, లేటరల్‌ ఎంట్రీ విధానం, ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు, వక్ఫ్‌ చట్ట సవరణ… ఇలా ప్రతి అంశంలోనూ ముందుకెళ్లేందుకు ప్రయత్ని స్తూనే వుంది. ఈ అజెండాతో వెళ్తే.. తమ కొంప కొల్లేరైపోతుందని సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు సైతం భయపడుతున్నాయి. మరో వైపు చేతికి ఎముక లేదన్నట్టు ఆశ్రిత కార్పొ రేట్లకు సర్వం కట్టబెడుతూ, వారి అరాచకాలకు కొమ్ముకాస్తోంది.
మూటగట్టుకున్న ప్రజావ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో.. చేసిన జిమ్మిక్కులు వికటించాయి. పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) స్థానంలో తీసుకొస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌)పై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నమేదీ గత వందరోజుల్లో లేదు. అగ్నివీర్‌ను సమీక్షిస్తామని చెప్పినా.. ఆ పథకాన్ని రద్దు చేయాల్సిందేనన్న నినాదం మారుమోగుతోంది. అదానీ కుంభకోణంలో అడ్డంగా దొరికి పోయిన సెబీ చైర్‌పర్సన్‌ మాధబి బచ్‌కు వత్తాసు పలుకుతూ, చర్యలకు మీనమేషాలు లెక్కిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్య కలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధాన్ని ఎత్తివేసిన కొద్దిరోజులకే లేటరల్‌ ఎంట్రీ విధానం తీసుకురావడం యాదచ్ఛికం కాదు. నిపుణుల పేరుతో కార్పొరేట్లను, సంఫ్‌ు పరివారాన్ని తీసు కొచ్చి, బ్యూరోక్రసీని నేరపూరితం, కార్పొరేటీ కరించడమే లక్ష్యంగా సివిల్స్‌ అభ్యర్థుల కలలను కల్లలు చేసేందుకు యత్నించింది. పెద్దఎత్తున నిరసన, మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీ వ్యతి రేకతతో మూడో రోజే విరమించుకోవాల్సి వచ్చింది. ఆలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదంటూ నిత్యం ఉద్రిక్తతలు రెచ్చగొడుతూనే.. సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులను ముస్లిమేతరులతో నింపేసి, ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే వక్ఫ్‌ సవరణ చట్టంపై సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. మిత్రపక్షాలుసైతం మద్దతివ్వలేమని సంకేతాలి వ్వడంతో జేపీసీకి నివేదించింది. తగినంత మెజారిటీ లేకపోయినా.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ జమీలీకి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. జమీలీ ఎన్నికలు ప్రజాస్వామ్య సూర్తికే విరుద్ధమని విజ్ఞునుల మాట.
లోక్‌సభ ఎన్నికల్లో మోడీ సర్కారు, గోడీ మీడియా బండారాన్ని బయటపెట్టిన కొన్ని యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లు, కొందరు యూట్యూబర్లు లక్ష్యంగా తీసుకొచ్చిన బ్రాడ్‌ కాస్టింగ్‌ సర్వీసెస్‌ (నియంత్రణ) బిల్లుకు తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్టోబర్‌15 వరకూ స్పందనలు సమర్పించ వచ్చంటూ మంత్రితో ప్రకటన చేయించింది. కోవిడ్‌ సాకుతో జనగణనను వాయిదా వేసిన కేంద్రం.. కులగణనకు ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడు తుండటంతో.. అందుకు సమాయత్తమవుతున్నట్టు సంకేతాలిస్తోంది. గ్రామీణులకు కొంతమేరకు భరోసా ఇస్తున్న ఉపాధి హామీ నిధుల్లో కోత పెడుతూ ఉసురు తీస్తోంది. పంటల బీమా పథకం, యూరియా సబ్సిడీ, పోషకాహార ఆధారిత సబ్సిడీలకూ కేటాయింపులు తగ్గించింది. కొల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై లైంగికదాడి, హత్యపై న్యాయం చేయడానికి బదులు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పాకులాడుతోంది.
కథువా, హత్రాస్‌, ఉన్నావ్‌, మణిపూర్‌లో అత్యంత అనాగరిక ఘటనల గురించి ఎన్నడూ నోరుమెదపని మోడీ.. ఇటీవల మహిళల భద్రత గురించి మాట్లాడటం విడ్డూరమే! హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఆవు పేరుతో ఆటవికంగా హత్యలు చేసే ఘోరాలు సాగిపోతూనే ఉన్నాయి. నేరస్తులను రక్షిస్తూ, బాధితులను జైళ్లలో తోస్తున్నది. ఈ దేశంలో మనుషుల కంటే ఆవులు, దూడలే ముఖ్యమన్నట్టు.. కొత్తగా దూడను తన కుటుంబ సభ్యురాలిగా చేసుకుంటున్నా నంటూ సోషల్‌ మీడియాలో ప్రధాని ప్రకటించారు. దానికి ‘దీపజ్యోతి- అంటూ నామకరణం కూడా చేశారు. కార్పొరేట్‌ అనుకూల, మతోన్మాద అజెండానే మోడీ 3.0 లోనూ ముందుకు సాగింది. ఈ దుర్విధానాలకు అడ్డుకట్ట వేయాల్సింది ప్రజా ఉద్యమాలే!