రియల్‌ ఎస్టేట్‌లో మార్పు వస్తోంది

Change is coming in real estate– ‘రెరా’ రిజిస్ట్రేషన్లు పెరిగాయి
– బిల్డర్లలో జవాబుదారీతనం
– అయినా అప్రమత్తత అవసరం :చార్టెడ్‌ అక్కౌంటెంట్స్‌ సదస్సులో ‘రెరా’ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయనీ, దానివల్ల కొనుగోలుదారులకు భద్రత, విశ్వాసం పెరుగుతాయని తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌రెరా) చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ అన్నారు. బిల్డర్లు తమ వెంచర్లను తప్పనిసరిగా ‘రెరా’ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనీ, వారిలో జవాబుదారీతనం పెరిగిందని చెప్పారు. అయినా వినియోగదారులు ఆస్తుల క్రయవిక్రయాలు, వ్యాపార లావాదేవీలపట్ల అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో ‘రెరా లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం’ నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారంనాడాయన ప్రారంభించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పారదర్శకత, జవాబుదారితనం లోపిస్తే, కుటుంబసభ్యులు కష్టపడి కూడబెట్టిన సొమ్మును నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ‘రెరా’ చట్టం అమలుతో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. బిల్డర్లు, ప్రమోటర్లు, డెవలపర్లలో మార్పులు వచ్చి ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రకటనలు, మార్కెటింగ్‌ చేయడం వంటి చర్యలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ‘రెరా’ వెబ్‌సైట్‌లో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నిర్మాణ వివరాలను పొందుపర్చడం వల్ల న్యాయపరంగానూ లబ్ది చేకూరుతుందన్నారు. సంస్థళో ఫిర్యాదుల విభాగంతోపాటు మధ్యవర్తిత్వం కోసం ఇటీవలే ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎమ్‌సీ)తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ‘రెరా’ నిబంధనలు ఉల్లంఘించిన పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేశామన్నారు. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లకు సర్టిఫికేట్‌ ప్రోగ్రాం నిర్వహించి వారికి రియల్‌ ఎస్టేట్‌ చట్టంతో పాటు వ్యాపార మెళకువలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. చార్టర్‌ అకౌంటెంట్లు సరైన సమాచారాన్ని ‘రెరా’కు అందిస్తూ, సహకారించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఐసీఏఐ అధ్యక్షులు ఏ సునీల్‌ తలాట్‌, ఉపాధ్యక్షులు రంజిత్‌కుమార్‌ అగర్వాల్‌, నారెడ్కో అధ్యక్షులు జీ హరిబాబు, ‘రెరా’ సభ్యాలు కే శ్రీనివాసరావు, జే లక్ష్మీనారాయణతో పాటు ఒరిస్సా, పంజాబ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల రెరా సభ్యులు కూడా పాల్గొన్నారు.