– ఉదయించే సూర్యుడు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలి : సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల ప్రచారంలో సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి బి.మధు
నవతెలంగాణ-మణుగూరు
మార్పు రావాలంటే.. సీఐటీయూ గెలవాలని, సింగరేణి సంస్థ గుర్తింపు ఎన్నికల్లో ఉదయించే సూర్యుడు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలో శుక్రవారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓసీ 2 వర్క్‌షాప్‌లో కార్మికుల ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ నెల 27న జరగబోయే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు కార్మికుల హక్కులు కాపాడుకునే విధంగా ఆలోచన చేసి సీఐటీయూని గెలిపించాలని కోరారు. సొంతింటి కల పెరిక్స్ ఇన్‌కమ్ టాక్స్ రియంబర్స్‌మెంట్ ఇప్పిస్తామన్నారు. సింగరేణి కార్మిక పిల్లలకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో నాణ్యమైన విద్య, 250 గజాల ఇంటి స్థలం, సింగరేణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, కారుణ్య నియామకాలు తదితర డిమాండ్లతో కూడిన హామీలను సీఐటీయూ కార్మికులకు ఇచ్చిందని తెలిపారు. సింగరేణిలో ప్రమోషన్లు వస్తే జీతం పెరగటం కన్నా జీతం తగ్గే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ సంఘాల వాళ్ళని అడగాల్సిన అవసరముందని, దీనిపై ఆలోచించాలని కోరారు. అనంతరం యూనియన్ రాష్ట్ర నాయకులు కె.బ్రహ్మచారి మాట్లాడారు. కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు టీవీఏంవీ ప్రసాద్, డివిజన్ కన్వీనర్ గద్దల శ్రీనివాస్, నాయకులు మాచారపు లక్ష్మణరావు, నందం ఈశ్వరరావు, విల్సన్ వై.రామ్మూర్తి, కొడిశాల రాములు, సూర్యనారాయణ, యు.నరసింహారావు, సత్రపల్లి సాంబశివరావు, హేమంతరావు, వెంకన్న, కార్మిక సోదరులు పాల్గొన్నారు.